భారత్ ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్‌ప్లాన్ సిద్ధం
గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేయనున్న సీఎం రేవంత్
విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా భూ కేటాయింపులు
ఉత్తర, దక్షిణ భాగంలో 2,032 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్లు
ఫ్యూచర్ సిటీలో అంతర్గత రోడ్ల విస్తీర్ణం 278 కి.మీ.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే కాన్సెప్ట్ తో ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. సుస్థిర పర్యావరణ వ్యవస్థలో బహుళ రంగాల సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్పే ఈ ఫ్యూచర్ సిటీ. కృత్రిమ మేధస్సు, క్రీడలు, విద్య, వైద్యం.. ఇలా 12 జోన్లతో మొత్తం 13,440 ఎకరాలలో సిద్ధమైన మాస్టర్ ప్లాన్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
సీఎం రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ నూతన నగరం 56 రెవెన్యూ గ్రామాలతో మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. భవిష్యత్తు అవసరాలు, ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ సిటీ రూపకల్పన బాధ్యతలను సింగపూర్‌కు చెందిన ప్రముఖ అర్బన్ ప్లానింగ్ కన్సల్టెన్సీ డీపీ ఆర్కిటెక్ట్స్‌కు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత మహానగర అవసరాలతో పాటు రాబోయే దశాబ్దాల సవాళ్లను తట్టుకునేలా అత్యంత సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో, అలాగే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ అవసరమేంటి?
దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ‘పాతబస్తీ’ఎలాంటి ఆధునిక ప్రణాళికలు లేకుండా సహజంగా అభివృద్ధి చెందింది. అతర్వాత 1798లో బ్రిటిష్ సైన్యం ఏర్పాటు చేసిన ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్’గ్రిడ్ లేఅవుట్‌తో కూడిన తొలి ప్రణాళికాబద్ధమైన ప్రాంతం. అక్కడ్నుంచి 1990లో అభివృద్ధి చేసిన ‘హైటెక్ సిటీ’ఐటీ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చినప్పటికీ.. చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రణాళికలేని పట్టణీకరణ కారణంగా ట్రాఫిక్ రద్దీ, వరద ముంపు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు జనాభా ఒత్తిడిని తట్టుకునేందుకు సరికొత్త ప్రాంతంలో సమగ్ర ప్రణాళికతో గ్రీన్‌ఫీల్డ్ డెవలప్‌మెంట్ కింద ఈ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారు.
భూ కేటాయింపులు ఇలా..
జోన్ ఎకరాలు
ఏఐ సిటీ 508.94
హెల్త్ సిటీ 663.87
ఎంటర్‌టైన్‌మెంట్
అండ్ మిక్స్‌డ్ యూజ్ 685.92
స్పోర్ట్స్ హబ్ 433.84
రెసిడెన్షియల్ (సౌత్) 1,343.17
ఫర్నిచర్ పార్క్ 248.46
ఈవీ అండ్ ఈఎస్‌ఎస్ 2,002.49
ఎకో టూరిజం–జూ 346.69
లైఫ్ సైన్సెస్ హబ్ 4,073.48
ఎలక్ట్రానిక్స్ అండ్
అడ్వాన్డ్స్ మాన్యుఫాక్చరింగ్ 2,003.73
డేటా సెంటర్ హబ్ 357.89
ప్లాటెడ్ రెసిడెన్షియల్ (నార్త్) 689.23
ఎడ్యుకేషన్ జోన్ 82.23
⇒ ఫ్యూచర్ సిటీలో అంతర్గత రోడ్ల విస్తీర్ణం 278 కి.మీ... కాగా ఇందులో 28 కి.మీ. ట్రంక్ రోడ్లు. అంటే ప్రధాన రహదారి జాతీయ/రాష్ట్ర స్థాయి ప్రధాన రోడ్డు మార్గం. ఓఆర్‌ఆర్ రావిర్యాల ఇంటర్‌చేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు 41.5 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో మెట్రో మార్గం అనుసంధానానికి ఇందులో ప్రత్యేక వసతి కల్పించారు.
⇒ సుమారు 72 కి.మీ దూరంలో ఉన్న వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి రోజుకు 235 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) నీటిని తరలించేలా ప్రణాళిక.
⇒ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్‌ఎల్‌డీ) విధానంతో ఉండే ఈ సరికొత్త నగరంలో డి్రస్టిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ (డీసీఎస్) ద్వారా 30 శాతం శక్తి ఆదా అవుతుంది.
⇒ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్), మీర్‌ఖాన్‌పేట్ సబ్‌స్టేషన్ల ద్వారా సుమారు 2,560 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశారు.


