పీసీసీఎఫ్–హెచ్‌వోఎఫ్‌ఎఫ్ వినయ్‌కుమార్
రాష్ట్ర అటవీశాఖ సమగ్రాభివృద్ధికి రూ.1,270 కోట్ల సాఫ్ట్ లోన్లు
ఐదేళ్ల కాలానికి గాను డిసెంబర్ నుంచి అందుబాటులోకి..
ఆరు సర్క్యూట్లలో రూ.495 కోట్ల వ్యయంతో ఎకో టూరిజం ప్రాజెక్టులు
అమ్రాబాద్, కవ్వాల్‌లలో రెండు టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు
2027 మార్చి కల్లా మహారాష్ట్ర నుంచి కవ్వాల్‌కు పులులు
1,516 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం
‘సాక్షి’ఇంటర్వ్యూలో పీసీసీఎఫ్–హెచ్‌వోఎఫ్‌ఎఫ్ వినయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ సమగ్రాభివృద్ధికి సంబంధించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)నుంచి ఐదేళ్ల కాలానికి గాను రూ.1,270 కోట్ల విలువైన సాఫ్ట్ లోన్లు (అతి తక్కువ వడ్డీ లేదా వడ్డీ రహిత) ఈ ఏడాది డిసెంబర్‌లో అందుబాటులోకి రానున్నట్టు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్–హేచ్‌వోఎఫ్‌ఎఫ్) వినయ్‌కుమార్ వెల్లడించారు.
రాష్ట్రంలో అటవీ రంగ ఆధునీకరణ, పర్యావరణ సమతుల్యత పరిరక్షణలో ఈ అంతర్జాతీయ సహాయం ఎంతో కీలకమని తెలిపారు. ఇందులో భాగంగా ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్ రిజర్వ్‌ల బలోపేతం, వన్యప్రాణి సంరక్షణ, పట్టణ అటవీ అభివృద్ధి, క్షీణించిన అడవుల పునరుద్ధరణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ వంటి కీలక పనులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అటవీ శాఖకు సంబంధించిన పలు ప్రాధాన్యత అంశాలను వినయ్‌కుమార్ వివరించారు.
ఎకో టూరిజం
రాష్ట్రంలోని ఆరు సర్క్యూట్లలో చేపడుతున్న ఎకో టూరిజం (ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులకు హాని కలిగించని పర్యాటకం) ప్రాజెక్లులు వచ్చే అయిదేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. మొత్తం రూ.495 కోట్ల వ్యయంతో పనులు చేపడుతుండగా, వీటికి సంబంధించి మంజూర్లు కూడా లభించాయి. అంతేకాకుండా అటవీశాఖ, అటవీ, పర్యాటకాభివృద్ధి సంస్థలు ఇతర విభాగాలతో కలిసి సంయుక్తంగా రూ.900 కోట్ల విలువైన ‘షెల్ఫ్ ఆఫ్ వర్క్స్’ (వివిధ రకాల పనులు) చేపడుతున్నాం.
కవ్వాల్‌లో పులుల సంరక్షణ
కవ్వాల్ పులుల సంరక్షణకు మంచి అవకాశాలున్న ప్రాంతం. అడవులు బాగున్నంత మాత్రాన అక్కడ పులులు స్థిరంగా నివసిస్తాయని చెప్పలేం. సరిపడా ఆహార జంతువులు, సురక్షితమైన సంతానోత్పత్తి ప్రాంతాలు, అడవుల మధ్య అనుసంధానం, వేట నిరోధక చర్యలు అవసరం. 2027 మార్చి కల్లా ఒక మగ, రెండు ఆడ పులుల జతతో కూడిన మొదటి బ్యాచ్ మహారాష్ట్ర నుంచి కవ్వాల్‌కు చేరే అవకాశాలున్నాయి. కవ్వాల్‌కు పులులను తీసుకురావడం మాత్రమే కాదు.. అవి అక్కడ మనుగడ సాగించి, సంతానోత్పత్తి చేసి, శాశ్వత జనాభాగా ఎదిగేలా చూడటమే మా లక్ష్యం.
మనుషులు– వన్యప్రాణుల ఘర్షణ
రైతుల జీవనోపాధిని కాపాడుతూనే వన్యప్రాణులను రక్షించడమనేది చాలా క్లిష్టమైన అంశం. మనుషుల ప్రాణాలు, వన్యప్రాణుల మనుగడ రెండూ ముఖ్యమే. జంతువుల కదలికలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, వేగంగా స్పందించే బృందాలను సిద్ధంగా ఉంచడం, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేయడం ద్వారా ఘర్షణలను తగ్గించవచ్చు. వన్యప్రాణులతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందాలి. పంటలు, పశువులకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా సకాలంలో అందాలి. అడవుల్లో ఆహారం, నీరు, సురక్షిత సంచార మార్గాలు మెరుగుపడితే జంతువులు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఇదీ చదవండి: కూరగాయల ధరలు కుతకుత
టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రతిపాదన
రాష్ట్రంలో నక్సలైట్ల బెడద పూర్తిగా తొలగిపోయినందున..త్వరలోనే ఆ కార్యకలాపాల్లో నిష్ణాతులైన ‘గ్రేహుండ్స్’కు చెందిన రెండు బృందాలను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లలో ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ల రూపంలో నియమించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు పంపించిన ప్రతిపాదనలపై సానుకూల స్పందన లభించింది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులులు
అమ్రాబాద్‌లో పులుల సంరక్షణ, సంఖ్య పెరగడం అనేది ఒక్క అధికారి లేదా ఒక్క ఏడాదిలో సాధించిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న సమష్టి కృషి ఫలితం. పులుల సంరక్షణ అంటే ప్రధానంగా వాటి ఆవాసాలను కాపాడటమే. అడవులు ఆరోగ్యంగా ఉండటం, పులులకు సరిపడా ఆహారంగా ఉపయోగపడే జంతువులు ఉండటం, నీటి లభ్యత, వేట నిరోధక చర్యలు, మానవ సంచారం వల్ల కలిగే ఇబ్బందుల తగ్గింపు కీలకం. చెంచు గిరిజనుల భాగస్వామ్యం కూడా ముఖ్యమైనది.
ఇదీ చదవండి: తెలుగు యువకుడి బుకింగ్ రైడ్ యాప్
రాష్ట్ర పక్షి పాలపిట్ట పరిరక్షణ
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట వేగంగా అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో, ఇతర చోట్ల కలిసి రెండువేల పిట్టలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. వీటి పరిరక్షణలో భాగంగా.. కొత్త సంతానాన్ని లేదా జాతులను ఉత్పత్తి చేసేందుకు (బ్రీడింగ్) డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి ప్రతిపాదనలు పంపించాం. ‘టైగర్ రీ ఇంట్రడక్షన్’ మాదిరిగానే పాలపిట్ట పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
అక్రమ విద్యుదీకరణ, వన్యప్రాణుల వేట
కంచెలకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం వన్యప్రాణులకే కాదు.. రైతులు, గ్రామస్తులు, అటవీ సిబ్బందికి కూడా ప్రాణాంతకమైన ముప్పు. పోలీసులు, విద్యుత్ శాఖతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, నిఘా పెంచడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాం.
అటవీ సిబ్బందికి ఆయుధాలు
అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బందిపై జరిగే దాడులు మా శాఖపై జరిగే దాడిగానే పరిగణిస్తాం. గత ఐదేళ్లలో 50కి పైగా దాడుల్లో 65 మంది గాయపడ్డారు. ఇద్దరు చనిపోయారు. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ఫారెస్ట్ గార్డులకు తగిన భద్రత, శిక్షణ, పరికరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ నేపథ్యంలో ఇతర యూనిఫామ్ సర్వీసెస్ మాదిరిగానే ఆయుధాలు, అవసరమైన సామాగ్రి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం.
సిబ్బంది కొరత
అటవీ రక్షణకు మానవ వనరులే వెన్నెముక. డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఉపగ్రహ నిఘా వంటి ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే ఫారెస్ట్ గార్డుకు ప్రత్యామ్నాయం లేదు. ప్రస్తుతం సిబ్బంది కొరత వల్ల గస్తీ, వన్యప్రాణుల పర్యవేక్షణ, అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితులకు స్పందించడం వంటి పనులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా సమస్యాత్మక, సున్నితమైన అటవీ ప్రాంతాల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలి. 1,516 మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వ ఆమోదం లభించింది.
ఇదీ చదవండి: భూభారతి.. నత్తనడక!
అటవీ భూముల ఆక్రమణల నిరోధం
అటవీ భూములు కోల్పోతే వాటిని తిరిగి పునరుద్ధరించడం చాలా కష్టం. అందుకే ఆక్రమణలను అరికట్టడం అత్యంత ముఖ్యం. అటవీ సరిహద్దుల గుర్తింపు, డిజిటల్ భూ రికార్డులు, జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలి.
పీసీసీఎఫ్‌గా ప్రాధాన్యాలు
అటవీ శాఖను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా, క్షేత్రస్థాయికి చేరువగా తీర్చిదిద్దడం నా మొదటి ప్రాధాన్యం. శాస్త్రీయ పద్ధతుల్లో వన్యప్రాణుల సంరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం, అమ్రాబాద్ పులుల అభయారణ్యం మరింత బలోపేతం, కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని పులుల స్థిర నివాసానికి అనువుగా తీర్చిదిద్దడం, వన్యప్రాణుల సంచార మార్గాలను కాపాడటం, అరుదైన జీవజాతుల సంరక్షణ, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెడతా.


