భూభారతి.. నత్తనడక! | Bhu Bharati Portal Facing Technical Issues: Telangana | Sakshi
Sakshi News home page

భూభారతి.. నత్తనడక!

Oct 20 2026 6:21 AM | Updated on Oct 20 2026 6:30 AM

Bhu Bharati Portal Facing Technical Issues: Telangana

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పోర్టల్‌కు మళ్లీ సాంకేతిక సమస్యలు 

వారమంతా ఒడిదుడుకులే..  రెండురోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్‌ 

ఒక్కోరోజు స్లాట్‌ బుక్‌ కావడానికే రెండు గంటల పాటు సమయం 

సర్వర్‌ డౌన్‌తో ఇబ్బందులు.. పోర్టల్‌లో మార్పులే కారణం!

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ భూభారతిలో సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్వర్‌ డౌన్‌ సమస్యతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. వారం రోజులుగా భూభారతి పోర్టల్‌ వ్యవసాయ భూముల క్రయవిక్రయదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, సర్వర్‌ డౌన్‌తో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా ఒక్కో కార్యాలయంలో ఒక రోజులో నాలుగైదురిజిస్ట్రేషన్లు కూడా కాలేదని రెవెన్యూ వర్గాలే చెపుతున్నాయి. తొలి రెండు రోజులు అయితే అసలు సర్వర్లే పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. తర్వాతి రోజుల్లో చాలా నెమ్మదిగా, కొంత నెమ్మదిగా సర్వర్లు పనిచేయడంతో ఒక్కో స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు కూడా రెండు గంటల సమయం పట్టింది. మొత్తం మీద గడచిన వారమంతా భూభారతి ద్వా రా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మందగమనంలో సాగడం గమనార్హం.  

మార్పులు, సమస్యలు సహజమేనా?  
వెబ్‌పోర్టల్స్‌ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తడం సహజమే అయినా, భూభారతిలో మాత్రం తరచూ సమస్యలు వస్తుండడం అటు క్రయ విక్రయదారులను, ఇటు రెవెన్యూ వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏప్రిల్‌లో మొదలైన ఈ పోర్టల్‌ అప్పటినుంచే సమస్యలకు కారణమవుతోంది. ఒక్కోసారి అయితే 10–15 రోజులు కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 

కానీ ఉన్నతాధికారులు, ఈ పోర్టల్‌ నిర్వహిస్తున్న ఎన్‌ఐసీ సిబ్బంది మాత్రం కేవలం సాంకేతిక సమస్య అనే కారణం చెప్పి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన సర్వర్‌ డౌన్‌ పరిస్థితులను కూడా ఉన్నతాధికారులు చాలా తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. పోర్టల్‌లో మార్పులు జరుగుతున్నాయని, మార్పులు జరిగే సమయంలో సహజంగానే సాంకేతిక సమస్యలు వస్తాయని వారు చెపుతున్నారు.  

ఈ సమస్యలకు పరిష్కారమేదీ? 
సాంకేతిక సమస్యలు ఓ వైపు ఉంటే మరోవైపు అంశాల వారీ సమస్యలు కూడా భూభారతికి తలనొప్పిగా మారాయి. ఈ సమస్యలను ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా జీపీఏ తీసుకోవడానికి ఓటీపీ రావడం లేదని క్రయవిక్రయదారులు వాపోతున్నారు. ఏజీపీఏ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ సమయంలో అమౌంట్‌ సర్దుబాటు కావడం లేదని, పూర్తి పేమెంట్‌ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు సేల్‌ డీడ్‌ చేసే సమయంలో ఓటీపీ ఆప్షన్‌ రావడం లేదని, ఇలా అంశాల వారీగా చాలా సమస్యలు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలతో పాటు లావాదేవీల్లో తలెత్తుతున్న అంశాల వారీగా కూడా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రయ విక్రయదారులు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement