వినియోగదారుల కమిషన్ తీర్పు
రైలు సర్వీసుల్లో నాణ్యతా లోపంతో ప్రయాణికులకు తీవ్ర అవాంతరాలు కలిగిస్తే భారతీయ రైల్వే భారీ పరిహారం చెల్లించక తప్పదని జార్ఖండ్‌లోని జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. నిర్ణీత సమయం కంటే దాదాపు 9 గంటలు ఆలస్యంగా నడిచినందుకు గాను బాధితుడికి రూ.35,000 పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఈ ఉత్తర్వులను అత్యంత కీలకమైన మైలురాయిగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
సంఘటన పూర్వాపరాలు
బాధితుడు సంజయ్ కుమార్ 2024 సెప్టెంబర్ 23న టాటానగర్ నుంచి సంబల్‌పూర్ వెళ్లేందుకు ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరికి స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:18 గంటలకు ప్రారంభం కావాల్సిన రైలు తీవ్ర జాప్యంతో బయలుదేరి ఏకంగా 8 గంటల 48 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. దీనివల్ల తనకు తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రూ.4.5 లక్షల పరిహారం కోరుతూ సంజయ్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
రైల్వే వాదన తిరస్కరణ
ఈ పిటిషన్‌పై రైల్వే శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ అంశం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుందని, కమిషన్‌కు విచారించే పరిధి లేదని వాదించింది. అయితే, సుప్రీంకోర్టు గత తీర్పును ఉటంకిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ చీఫ్ సునీల్ కుమార్ సింగ్, సభ్యులు ప్రదీప్ కుమార్ మిశ్రా, సంజు షాహీలతో కూడిన ధర్మాసనం రైల్వే వాదనను తోసిపుచ్చింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కీలక ప్రామాణికం
ప్రయాణికుల సమయం అత్యంత విలువైందని, రైలు ఆలస్యానికి తగిన సహేతుక కారణాలను, అది తమ నియంత్రణలో లేని పరిస్థితుల వల్లనే జరిగిందని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత రైల్వేదేనని కమిషన్ పేర్కొంది. సేవా లోపాన్ని నిరూపించడంలో రైల్వే విఫలమైందని స్పష్టం చేస్తూ బాధితుడికి మానసిక వేదనకు గాను రూ.30,000 పరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5,000 కలిపి మొత్తం రూ.35,000ను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గడువు దాటితే 12 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుందని హెచ్చరించింది. ఈ తీర్పు సమయపాలన పాటించని రవాణా సంస్థలకు గట్టి హెచ్చరిక అని, సామాన్య ప్రయాణికులకు తమ హక్కుల పట్ల ధైర్యాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే..


