న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఈ నెల ప్రారంభంలో ఓ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల‍్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆగస్టు 4న పరి చౌక్ సమీపంలో జరిగింది.
తన ఫిర్యాదులో బాధితురాలు.. నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించింది. అనంతరం వారు ఆమెను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ ఉత్తర జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిహారిక భట్ మాట్లాడుతూ.. డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అదే రోజు టిమార్పూర్‌లోని పార్కింగ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.
పోలీసులు బస్సును కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆగస్టు 14న బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. ఈ బాలిక ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నివాసి అని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో తల్లి మందలించడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. నోయిడా సెక్టార్ 63లో నివసించే తన బంధువు వద్దకు వెళ్లేందుకు ఆమె బయలుదేరింది.
భారీ వర్షం, చీకటి కారణంగా తాను పొరపాటున పరి చౌక్ వద్ద దిగిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. తాను వేరే ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని స్లీపర్ బస్సును ఆపినట్లు చెప్పింది. ఆ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సు నోయిడా సెక్టార్ 63కు వెళ్తోందని కండక్టర్ చెప్పడంతో ఆమె బస్సు ఎక్కింది.
సూరజ్‌పూర్‌లోని వర్క్‌షాప్‌లో మరమ్మతుల అనంతరం స్లీపర్ బస్సు ఖాళీగా తిరిగి వస్తోందని పోలీసులు తెలిపారు. బస్సు కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని బాలిక ఆరోపించింది. అనంతరం ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. నిందితులు ఆమెను రింగ్ రోడ్ సమీపంలో వదిలి పారిపోయిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది.
కుల్దీప్, సందీప్‌లపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి కేసులు నమోదు చేశారు. స్లీపర్ బెర్త్‌లకు బస్సులో తెరలు ఉంటాయి. ఫోరెన్సిక్ బృందాలు బస్సులో బాలికకు చెందిన వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల సంక్షేమ కమిటీ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 2012లో ఢిల్లీలో బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్భయ కేసును తలపించేలా ఈ తాజా ఘటన చోటుచేసుకుంది.


