మణిపూర్‌ జనగణనపై.. కేంద్రం కీలక నిర్ణయం | no census in manipur centre defers exercise after protests over nrc | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ జనగణనపై.. కేంద్రం కీలక నిర్ణయం

Aug 31 2026 7:34 PM | Updated on Aug 31 2026 7:54 PM

no census in manipur centre defers exercise after protests over nrc

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో జనగణన (సెన్సస్) కార్యకలాపాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మణిపూర్ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరిగింది.

గత కొంతకాలంగా మణిపూర్‌లో నిరసనలు మిన్నంటాయి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలు చేసేకంటే ముందే రాష్ట్రంలో జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని మణిపూర్‌లోని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో మణిపూర్ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది

ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల గొంతును విన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర నాయకులకు  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మణిపూర్ ప్రజల కోరికలను నెరవేర్చడంలో నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మణిపూర్‌లో ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలని ఇటీవల న్యూఢిల్లీలో క్యాంపెయిన్ నిర్వహించిన 14 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు. కేంద్ర నాయకులు, అధికారులతో వారు క్రమం తప్పకుండా జరిపిన సంప్రదింపుల వల్లే  ఈ రోజు  ఈ నిర్ణయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు.

తొలుత ఎన్‌ఆర్‌సీని పూర్తి చేయకుండానే కేంద్రం జనగణన నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో గత వారం మణిపూర్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎన్‌ఆర్‌సీ లేకుండా జనగణనను సమర్థించలేమని మైతేయి, నాగా వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, కుకీ-జో కౌన్సిల్ మాత్రం దీనికి భిన్నమైన వైఖరిని తీసుకుంది.

కాగా, 2023 నుంచి రాష్ట్రంలో చెలరేగిన మైతేయి-కుకీ జాతి హింసాకాండ కారణంగా 50,000 మందికి పైగా నిర్వాసితులయ్యారు. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ రోజు ( సోమవారం) న్యూఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో  మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ సహా పలువురు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement