పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వరుస ఓటములతో తీవ్ర విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జట్టు ప్రస్తుత పతనానికి 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై సాధించిన విజయమే ప్రధాన కారణమని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. ఆ చారిత్రత్మక విజయంతో పాక్ జట్టులో తీవ్రమైన నిర్లక్ష్యం, అతి విశ్వాసం పెరిగిపోయాయని అతడు అన్నాడు.
కాగా దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. టీ20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్‌కు అదే తొలి విజయం కావడం గమనార్హం.
"2021లో భారత్‌పై మనం గెలిచిన ఆ ఒక్క మ్యాచ్ ఈ రోజు మనల్ని దెబ్బతీసింది. ఎందుకంటే ఆ విజయం తర్వాత తాము ఏదో గొప్ప విజయం సాధించేశామని మనోళ్లు ఫీలయ్యారు. అందువల్ల భవిష్యత్ ప్లానింగ్, ఆటను మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ పెట్టలేకపోయారు. మనం అత్యుత్తమంగా రాణిస్తున్న సమయంలో ఎంతో వినయంగా ఉండాలి. అహంకారంతో ప్రవర్తిస్తూ, ఇతరుల పట్ల అగౌరవంగా ఉంటే సమస్యలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో సరిగ్గా అదే జరుగుతోంది అని యూసఫ్ పేర్కొన్నాడు.
అదేవిధంగా కెప్టెన్సీ మార్పు గురుంచి ఈ లెజెండరీ క్రికెటర్ మాట్లాడాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ కెప్టెన్ కావాలని ప్రయత్నించేవారు. ఇది కూడా పాక్ జట్టు ప్రస్తుత పరిస్థితికి గల ఒక కారణం. మన జట్టు గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన చేస్తోంది. పీసీబీ మద్దతు ఇచ్చినా, కోచ్‌లు మారినా ఆటగాళ్లలో బాధ్యతారాహిత్యం మారలేదు" అని అతడు చెప్పుకొచ్చాడు.
చదవండి: శుభ్‌మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం


