అదే మా కొంపముంచింది.. లేదంటే క‌థ మ‌రోలా ఉండేది: పాక్‌ కెప్టెన్‌ | Fatima Sana Slams Batters After Loss Against India | Sakshi
Sakshi News home page

అదే మా కొంపముంచింది.. లేదంటే క‌థ మ‌రోలా ఉండేది: పాక్‌ కెప్టెన్‌

Sep 6 2026 8:58 AM | Updated on Sep 6 2026 10:18 AM

 Fatima Sana Slams Batters After Loss Against India

మ‌హిళ‌ల ఆసియాక‌ప్‌-2026లో పాకిస్తాన్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. శ‌నివారం దుబాయ్ అంత‌ర్జాతీయ స్టేడియం వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాక్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. మ‌రోసారి దాయాది జ‌ట్టుపై హ‌ర్మ‌న్ సేన ఆధిప‌త్యం చెలాయించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు భార‌త బౌల‌ర్లు ఆది నుంచే చుక్క‌లు చూపించారు. ముఖ్యంగా పాక్ బ్యాట‌ర్లు భార‌త స్పిన్న‌ర్ల ఉచ్చులో చిక్కుకుని విల‌విల్లాడారు. 

శ్రీచ‌రణి, ప్రేమా రావ‌త్ త‌లా మూడు వికెట్లు పడ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును దెబ్బ‌తీశారు. వీరిద్ద‌రితో పాటు  దీప్తి శ‌ర్మ రెండు,  షెఫాలీ వ‌ర్మ ఓ వికెట్ సాధించారు. పాక్ బ్యాట‌ర్ల విష‌యానికి వ‌స్తే..  ఓపెన‌ర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన కెప్టెన్ ఫాతిమా స‌నా.. బౌలింగ్‌లో మాత్రం మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. అయిన‌ప్ప‌టికి ఈ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ ఫాతిమా స్పందించింది. బ్యాటింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే ఓడిపోయామ‌ని స‌నా చెప్పుకొచ్చింది.

"ఈ ఓటమి మమ్మల్ని ఎంతగానో బాధించింది. మ్యాచ్‌లో కనీసం ఒక్క భాగస్వామ్యం కూడా నెలకొల్పలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నుండి ముగిసే వరకు పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. కొత్త పిచ్ కావడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. బోర్డుపై మంచి స్కోరు ఉంచి, మా బౌలింగ్ బలాన్ని వాడుకోవాలనుకున్నాం.

కానీ మా ప్రణాళికలను మైదానంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. నేను బౌలింగ్‌లో రాణించినా, జట్టు ఓడిపోయినప్పుడు ఆ ప్రదర్శనకు ఏ విలువా ఉండదు. అదే జట్టు గెలిచి ఉంటే ఆ సంతోషం వేరుగా ఉండేది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా తదుపరి మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సనా పేర్కొంది. కాగా పాక్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 7న హాంకాంగ్‌తో తలపడనుంది.
చదవండి: IND vs PAK: ఆడింది చాలు పో!.. పాక్ కెప్టెన్‌ ఓవ‌రాక్ష‌న్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement