దుర్గగుడిలో ప్రారంభించిన దేవదాయ శాఖ కమిషనర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో తొలి సారిగా ఏటీఎం మిషన్ ద్వారా భక్తులకు దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గనగర్ సెంట్రల్ సమాచార కేంద్రం వద్ద బుధవారం ప్రసాదాల ఏటీఎం మిషన్‌ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. తొలుత ప్రసాదాల ఏటీఎంవద్ద అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కమిషనర్ స్వయంగా తన మొబైల్ ద్వారా ఆరు లడ్డూల బ్యాక్స్‌ను రూ. 100కు కొనుగోలు చేశారు.
పైలెట్ ప్రాజెక్టుగా..
రామచంద్రమోహన్ మాట్లాడుతూ ప్రసాదం కోసం అధిక సమయం కౌంటర్ల వద్ద వేచి ఉండకుండా త్వరతిగతిన అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా దుర్గగుడిలో డిజిటల్ చెల్లింపుల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఈ మిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది ప్రమేయం లేకుండా భక్తులు స్వయంగా ఈ మిషన్‌ను ఆపరేట్ చేసుకునే వీలు ఉందన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద ఈ మిష న్ ఏర్పాటు చేసి పనితీరును పరిశీలిస్తున్నామన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్ పోర్టులలో మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు..
దేవాలయాల్లో దర్శనాలు, సేవా టికెట్ల పేరిట దళారుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని రామచంద్రమోహన్ సృష్టం చేశారు. దుర్గగుడిలో ఆర్జిత సేవా టికెట్ పేరిట నకిలీ టికెట్ విక్రయించిన వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. అపరిచిత వ్యక్తులు, మధ్యవర్తులను ఆశ్రయించి పూజా టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించారు.


