దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.08కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.08కోట్లు

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.08కోట్లు స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి న్యాయమూర్తులకు సత్కారం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను బుధవారం లెక్కించారు. 14 రోజులకు గాను మొత్తం రూ. 2.08కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో మొత్తం రూ. 2,08,91,285 మేర ఆదాయంతో పాటు 203 గ్రాముల బంగారం, 2.674కిలోల వెండి లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. ఇక వివిధ దేశాలకు చెందిన కరెన్సీ యూఎస్‌ఏ డాలర్లు 192, యూఏఈ దిర్హమ్స్‌ 400, ఒమన్‌ బైంసాలు 300, కెనడా డాలర్లు 115, ఇంగ్లాండ్‌ పౌండ్లు 80 లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లెక్కింపును ఈవో శీనానాయక్‌, డీఈవో కిషోర్‌కుమార్‌, ఏసీ రంగారావు, ఏఈవో రమేష్‌బాబు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): స్వర్ణాంధ్రప్రదేశ్‌ – 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధవారం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై శాఖల వారీగా వర్క్‌షాప్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి అంశాలపై సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో ఉన్న పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌, ఇమిటేషన్‌ జ్యూవెలరీతో పాటు మల్లవల్లిలోని పారిశ్రామికవాడను సందర్శించి సమాచారం సేకరించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి, ఉద్యానశాఖ అధికారి జ్యోతి, మత్స్యశాఖ అధికారి ఎ. నాగరాజు, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను బుధవారం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు సందర్శించారు. అక్కడ యువతకు శిక్షణ ఇస్తున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి విద్య కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను కూడా మెరుగు పరుచుకోవాలని సూచించారు. అనంతరం ట్రస్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పరదేశిని కలిశారు.

విజయవాడలీగల్‌: విజయవాడ సిటీ సివిల్‌ కోర్టులలో న్యాయవాదులుగా నమోదై, ప్రాక్టీస్‌ చేస్తున్న బానావతు వెంకట సాయి నాయక్‌, వన్నపూస సుప్రియ జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికయ్యారు. వీరిరువురు విజయవాడ కోర్టులో ప్రాక్టీస్‌ చేసి, న్యాయమూర్తులుగా ఎంపికవ్వడంపై బెజవాడ బార్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. బుధవారం ఇరువురిని బీబీఏ అధ్యక్షుడు విష్ణు భొట్ల లక్ష్మీనారాయణ, బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలు రాగి గంగాభవాని, జనరల్‌ సెక్రటరీ వి.కిరణ్‌కుమార్‌, ఇందిర తదితర న్యాయవాదులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement