నిబద్ధతే నిలబెట్టింది | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతే నిలబెట్టింది

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

అవకాశం ఇచ్చిన జగనన్నకు రుణపడి ఉంటా

పదవికి వన్నె తెచ్చేందుకు

నిరంతరం కృషి చేశా

అడ్డంకులను అధిగమించి అభివృద్ధి పనులు

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక

పాల్గొన్న కలెక్టర్‌ బాలాజీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు

అవకాశం ఇచ్చిన జగనన్నకు రుణపడి ఉంటా

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ హాలులో నిర్వహించారు. ఈ నెల 24వ తేదీతో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, పాలకవర్గ కాలపరిమితి ముగియనుండటంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 1960లో ఏర్పడిన జిల్లా పరిషత్‌కు మొదటి చైర్మన్‌గా యార్లగడ్డ శివరామప్రసాద్‌ పనిచేశారని అనంతరం మాగంటి అంకినీడు, పిన్నమనేని కోటేశ్వరరావు లాంటి ఎంతో మంది ఉద్దండులు ఈ పదవిని అలంకరించారన్నారు. తనతో పాటు పది మంది జిల్లా పరిషత్‌ చైర్మన్లు పనిచేశారని.. వారి ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని, దీటుగా జిల్లా పరిషత్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగామన్నారు. జిల్లా పరిషత్‌ 25 మండలాలతో పునర్విభజన జరిగిన నేపథ్యంలో ముందుగానే గ్రహించి రూ. 98లక్షలతో సమావేశ హాలును సుందరీకరించి ఆగస్టులో ప్రారంభించామన్నారు. అలాగే 16 మండలాలతో ఏర్పడిన ఎన్టీఆర్‌ జిల్లాలో రూ. 65లక్షలతో సమావేశ మందిరం, చైర్మన్‌, సీఈవోల చాంబర్లతో ఆధునికీకరించి రానున్న పాలకవర్గ సభ్యులకు భవనాలను అందించగలిగామన్నారు.

రూ. 360 కోట్లతో అభివృద్ధి పనులు..

తన పదవీ కాలంలో సీపీడబ్ల్యూఎస్‌ స్కీం, 15వ ఆర్థిక సంఘం, జిల్లా పరిషత్‌ సాధారణ నిధులతో సుమారు రూ. 360కోట్లతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని హారిక చెప్పారు. మహిళా సాధికారత కోసం మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లలో శిక్షణ ఇప్పించి వారికి మిషన్లు పంపిణీ చేశామన్నారు. అలాగే ఏటాలానే పదో తరగతి ఫలితాల్లో కృష్ణాజిల్లా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్ఫూర్తి స్టడీ మెటీరియల్‌ను అందజేయటంతో పాటు పరీక్ష సమయంలో వారికి స్టడీ అవర్స్‌ నిర్వహించినప్పుడు స్నాక్స్‌ అందించామన్నారు.

ఉద్యోగోన్నతులు, నియామకాలు

జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 120 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు సుమారు 200 మందికి వివిధ కేటగిరీల్లో ఉద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగోన్నతులు కల్పించామని జెడ్పీ చైర్‌ పర్సన్‌ వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పరిషత్‌ నిధులను సమర్థంగా వినియోగించినందుకు న్యూఢిల్లీలో ఐసీఏఐ ప్రతినిధులు బెస్ట్‌ జిల్లా పరిషత్‌గా కృష్ణా జిల్లాను ఎంపిక చేయటంతో ఆ అవార్డును తాను స్వీకరించటం గర్వంగా భావిస్తున్నానన్నారు.

జెడ్పీ ఆదాయాల పెంపునకు కృషి..

జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల ద్వారా ఆదాయ వనరులు పెంపొందించేందుకు ప్రత్యేక కృషి చేశామన్నారు. మచిలీ పట్నం, అవనిగడ్డ జెడ్పీ స్థలాల్లో రూ. 3కోట్లతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేసి ప్రారంభించామని హారిక చెప్పారు. అలాగే జెడ్పీ కన్వెన్షన్‌ హాలు ద్వారా సంవత్సరానికి రూ.1.20కోట్లు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఆదాయాన్ని పెంచేందుకు జెడ్పీ స్థలాల్లో పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నుంచి అనుమతి పొందామన్నారు. ఈ ఐదేళ్లలో తనకు అభివృద్ధికి సహకరించిన అధికార యంత్రాంగం, జిల్లా పరిషత్‌ సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement