గౌతమ్‌రెడ్డిపై లాఠీచార్జికి న్యాయవాదుల నిరసన | - | Sakshi
Sakshi News home page

గౌతమ్‌రెడ్డిపై లాఠీచార్జికి న్యాయవాదుల నిరసన

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

విజయవాడలీగల్‌: సీనియర్‌ న్యాయవాది, వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో సోమవారం పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో గౌతమ్‌రెడ్డికి గాయాలై, స్పృహ తప్పి పడిపోవడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి, వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయనపై జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ లీగల్‌సెల్‌ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ వాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్టును అమలు చేయా లని నినాదాలు చేశారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్‌, బీబీఏ ఉపాధ్యక్షులు బండారుపల్లి లెనిన్‌బాబు, రాష్ట్ర జాయింటు సెక్రటరీ నారాయణరెడ్డి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షులు సాయిరాం, న్యాయవాదులు యక్కంటి పుల్లారెడ్డి, నిర్మల్‌ రాజేష్‌, తంగిరాల సౌమ్య, ఆదాంకుమార్‌, వెంకట ప్రతాప్‌కుమార్‌, గంజి ఉదయ్‌కిరణ్‌, జిల్లా జనరల్‌ సెక్రటరీ చంటిబాబు పాల్గొన్నారు.

పనులు వేగవంతం చేయాలి

ఎ.కొండూరు: జాతీయ రహదారి–30 విస్తరణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావుతో కలసి ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో ఆయన రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విస్తరణలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కిలోమీటరు మేర పనులు నిలిచిపోవడం వల్ల వాహనదారులు, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన పనులను త్వరితగతిన పునఃప్రారంభించి పూర్తి చేయడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో ఎ.కుమార్‌, తహసీల్దార్‌ ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.

నేడు లడ్డూ ఏటీఎం ప్రారంభం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ లడ్డూ ప్రసాదం ఇకపై ఏటీఎం మిషన్‌ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది. దేవస్థానంలో తొలి సారిగా లడ్డూ ఏటీఎం మిషన్‌ను కనకదుర్గనగర్‌లోని సెంట్రల్‌ సమాచార కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ ఏటీఎం మిషన్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ఏటీఎం మిషన్‌ భక్తులకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. భక్తులు లడ్డూలను ఈ మిషన్‌లో వచ్చే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు చేసిన తర్వాత లడ్డూలను పొందొచ్చు.

26న విజయవాడలో జాబ్‌ మేళా

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 26వ తేదీ ఉదయం 9.00 గంటలకు విజయవాడ కేబీఎన్‌ కాలేజ్‌లో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.12వేల నుంచి రూ.50వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9700092606, 9700025833, 8712495530లో సంప్రదించాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement