ముక్త్యాల(జగ్గయ్యపేట): రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన వేదాద్రి గ్రామంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యత అధ్వానంగా ఉందని దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని భవానీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం జగ్గయ్యపేటకు చెందిన భక్తుడు వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం అధ్వానంగా ఉందని కమిషనర్ దృష్టికి తీసుకురావటమే కాకుండా లడ్డూ ప్రసాదాన్ని చూపించాడు. రుచి చూసి ఈవో సురేష్‌బాబును లడ్డూ నాణ్యంగా లేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2028లో జరిగే కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే కృష్ణానది పుష్కర ఘాట్‌లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముక్త్యాల కోటను సందర్శించారు. జిల్లా ఏసీ లక్ష్మీనారాయణ శెట్టి, పెనుగంచిప్రోలు, తిరుమలగిరి ఆలయాల ఈవోలు లీలాకుమార్, సాంబశివరావు, కేసీపీ సంస్థ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు.


