చిన్నపాటి వర్షానికే వణుకుతున్న విజయవాడ
వర్షం వస్తే నదులను తలపిస్తున్న నగర రోడ్లు డ్రెయిన్ల నిర్వహణపై మునిసిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం రెండున్నరేళ్లుగా నగరాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం అమరావతికే పరిమితమైన మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడపై సీఎం చంద్రబాబు శీతకన్ను
ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు
డ్రెయిన్లు శుభ్రం చేయకపోవడం వల్లే..
విజయవాడ బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఏరులై పారుతున్న వర్షం నీరు(ఫైల్)
సాక్షి, విజయవాడ: రాజధాని ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రతి అంశంపై సమీక్షిస్తున్నా అని ప్రచారం చేసుకునే సీఎం.. చిన్నపాటి వర్షానికి చెరువులను తలపించేలా మారుతున్న విజయవాడ రోడ్ల దుస్థితిపై కనీస పర్యవేక్షించడం లేదు. విజయవాడలో మోస్తరు వర్షం కురిసిన నిమిషాల వ్యవధిలోనే డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. పాలీక్లినిక్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు.. బందర్ రోడ్డు నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ పరిసరాల వరకు ఎక్కడ చూసినా నీటిముంపు తప్పట్లేదు.
ఈ ప్రాంతాల్లో..
ముఖ్యంగా నగరంలోని బస్టాండ్ వద్ద, ఎంజీరోడ్డు, బందరురోడ్డు, బీమా జ్యూవెలరీ రోడ్డు, వరమహాలక్ష్మి రోడ్డు, విశాలాంధ్రరోడ్డు, జమ్మిచెట్టురోడ్డు, బెంజిసర్కిల్, నిర్మలాకాన్వెంట్, సత్యనారాయణపురం, గాంధీనగర్‌లో రోడ్లలో వర్షపునీరు నిలుస్తోంది. ఎంజీరోడ్డులో కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలాగే పలు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలోకి వర్షపునీరు చేరుతోంది. సాయంత్రం స్కూళ్లు వదిలే సమయాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటోంది. సత్యనారాయణపురంలోని నర్రవారి వీధిలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ ముందు కొద్దిపాటి వర్షానికే నీరు నిలుస్తుండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. వరమహాలక్ష్మి రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ద్విచక్రవాహనాల్లోకి వర్షపు నీరు చేరి పాడయ్యాయి. ఇటీవల భారీ వర్షాల సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని సబ్‌వేలో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుపోవడం, ప్రయాణికులను, క్రేన్‌తో బస్సును బయటకు తరలించాల్సి వచ్చింది.
డ్యాష్‌బోర్డులో వరద కనిపించదా?
రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో పగటివేళ బల్బులు వెలిగినా డ్యాష్‌బోర్డులో తనకు కనిపిస్తుందని, ఏ మూలన ఏమి జరిగినా తనకు ఇట్టే తెలిసిపోతుందని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు విజయవాడలో వర్షం పడితే రోడ్లు మునిగిపోతున్న దృశ్యాలు డ్యాష్‌బోర్డులో కనిపించవా? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాజధాని అమరావతి మీదే ప్రభుత్వం దృష్టి పెడుతోంది తప్పా రాజధానికి అత్యంత కీలకమైన విజయవాడలో సమస్యలను పరిష్కరించలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. విజయవాడ సిటీ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ నగరంలో దీన పరిస్థితులపై నోరెత్తిన పాపాన పోవడం లేదు. అలాగే విజయవాడకు నిత్యం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల తాకిడి ఉంటుంది. అయితే చిన్న వర్షం వస్తే మునిగే రోడ్లు, పొంగే డ్రెయిన్లు, నిలిచిపోయే ట్రాఫిక్ మాత్రం వారికి పట్టడం లేదు. తాత్కాలిక చర్యలతో సరిపెట్టి మమ అనిపించడం కాకుండా, శాశ్వత డ్రెయినేజీ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.
వర్షపునీరు రోడ్లపై చేరడం.. అధికారులు రంగంలోకి దిగడం.. యంత్రాలతో నీటిని తోడేయడం.. వర్షం తగ్గగానే సమస్య ముగిసినట్లు భావించడం వల్ల సమస్య పునరావృతమవుతోంది. ఇటీవల కూడా అధికారులు పాలీక్లినిక్, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను వినియోగించారు. కానీ వర్షపు నీరు నిలవకుండా డ్రెయినేజీ వ్యవస్థను శాశ్వతంగా పటిష్టం చేయడంపై దృష్టి సారించడం లేదు. భారీ వర్షాల సమయంలో డ్రెయిన్లు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు సమస్యను మరింత తీవ్రం చేస్తోందనే విషయం అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కార్పొరేషన్ అధికారులు సైతం పదే పదే ఈ సమస్య తలెత్తతున్నా నిర్లక్ష్యం వీడడం లేదు. రెండేళ్ల కిందటి వరదల సమయంలో నగరవాసులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి.


