breaking news
Indian education system
-
చదువుకూ, విద్యకూ తేడా!
వేసవి కాలం ఉక్కపోత, విద్యార్థులకు పరీక్షలు, ఫలితాల కాలం. చదువుకు అధిక ప్రాముఖ్యాన్నిచ్చే సమాజంలో, ముఖ్యంగా మధ్యతరగతి తెలుగు కుటుంబాలలో, చదువుతో వచ్చే పట్టాలకి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు పిల్లలపై ఉంచే అంచనాల వల్ల పెరిగే ఉక్కపోత వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నది అందరం గమనించే విషయమే. ఏ దేశానికైనా మూల వనరులతో పాటు మానవ వనరులు కూడా చాలా అవసరం. దేశంలో సుమారు 60 వేల ఉన్నత విద్య సంస్థలు ఉన్నాయి. 2023–24 ఆర్థిక సర్వే ప్రకారం, సగం మంది పట్టభద్రులు నైపుణ్యం లేమి కారణంగా ఉద్యోగార్హత లేనివారు. ఈ పట్టభద్రులలో విద్యావంతులు ఎంతమంది?చదువు, విద్య అన్న పదాలను సమానార్థకంగా వాడుతున్నా, వాటి అంతరార్థం వేరు. కొన్ని విషయాలను నేర్చుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఒక పట్టా పొందే అవకాశం ఇచ్చే ప్రక్రియను ‘చదువు’ అని అంటున్నాం. మరి విద్య అంటే?చదువుకూ, విద్యకూ తేడా!‘అజ్ఞానాన్ని తరిమివేసే సత్యాన్వేషణే విద్య’ అంటాడు సోక్రటీస్; ‘ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య’ అని నిర్వచించాడు అరిస్టాటిల్’; ‘మానవుడి బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, శీలం ఏర్పడుతుందో, మానవుడు దేని ద్వారా స్వశక్తితో నిల్చుంటాడో అదే విద్య’ అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు.ప్రస్తుత కాలంలో, కొలువుల కోసం కనీస అర్హతనిచ్చే పట్టాలు పొందడమే పరమావధిగా చదువుల ప్రహసనం సాగుతోంది. చదివే సబ్జెక్టుకీ, చేసే ఉద్యోగానికీ పొంతన లేని సందర్భాలు చాలా చూస్తాం. ఏ సబ్జెక్టులో డిగ్రీ పొందినా సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడం కోసం యువత పడే పాట్లు ఆధునిక భారత సమాజంలో చూస్తున్నాం. అమెరికాలో ఆర్థిక మాంద్యం అని పుకార్లు వస్తే చాలు అబ్బాయికి వణుకు, అయ్యకి గుండె నొప్పి! ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలమనే ఆత్మ నిబ్బరం కలిగించే ‘విద్యనివ్వని చదువులు’ ఒత్తిడి కారకం అవుతున్నాయన్నమాట!చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో జ్ఞానం ఇచ్చే చదువులు అరుదు. ప్రస్తుత చదువులు సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాయి. బతుకుతెరువు నేర్పే విద్యలు కళాశాలలో, విశ్వ విద్యాలయాలలో దొరకడం లేదు. ఏ పట్టాలూ లేని రైతు అనుభవంతో పొందిన నైపుణ్యంతో పంట పండిస్తాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో అత్యున్నత పట్టా పొందిన వారికి పొలం దున్నడం, విత్తనాలు వేయడం పాఠ్యాంశంగా మాత్రమే తెలుసు.పట్టాల కోసం చదివినా... చదువులు యువతకు కొన్ని బతుకు పాఠాలు నేర్చుకునే సాధనాలుగా ఉండాలి. సొంతంగా, తార్కికంగా ఆలోచించి జీవిత ప్రయాణం కొనసాగించే నేర్పు, మనఃస్థితి అలవర్చుకునేలా విద్యనభ్యసించాలి. అది విద్యాలయాల ద్వారా సాధ్యం కాకపోయినా పుస్తక పఠనం ద్వారా, పెద్దల నుంచీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే, యువతకు మార్గనిర్దేశం చేయగల పెద్దలు సమాజంలో ఉన్నారా? తమ పిల్లలు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించే గొప్ప డిగ్రీలు పొందాలని ఆశించడం సహజమే కానీ సంపాదనతో పాటు సమాజ హితం కాంక్షించే నైజం అలవరచుకోవాలని కోరుకోవడం అభిలషణీయం కదా!ముఖ్యంగా యువత విద్యతో పాటు విచక్షణ నేర్వడం అవసరం. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోగల వివేకం అలవ ర్చుకోవడమే చదువు అంతిమ లక్ష్యంగా ఉండాలి. పట్టాలు పొంది విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టే యువతకు ‘వివేక చూడామణి’ ఏది? శ్రీవిష్ణుపురాణం ‘విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్, సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా’ అని విద్యా శక్తిని ప్రతిపాదిస్తుంది. ఏ విద్య సాయంతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్య ఆ వ్యక్తికి పూజనీయమైనది; ఆ విద్య ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది అని సారాంశం. విద్య ప్రయోజనాలు, ఆవశ్యకత గురించి ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్’ అనే భర్తృహరి సుభా షితం సమగ్రంగా చెబుతుంది. భౌతిక సుఖాలు, సౌకర్యాలు చేకూర్చే సాధనంగా విద్యను నిర్వచించినా, ‘విద్య గురువు, విశిష్ట దైవతము’ అని చెబుతాడు. అంటే సన్మార్గంలో నడిచే విధంగా మార్గదర్శనం చేసేది, ఉత్తమ గుణసంపదనిచ్చేది. విద్యకు రూపం లేదు; కానీ మంచి విద్య పొందినవారు తమకు తాము గురువు గానూ, దైవం గానూ మలచుకునే శక్తియుక్తులు సంపాదించి సమాజానికి ఉపయో గపడాలన్నది భర్తృహరి ఉపదేశ సారం.చదవండి: గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు? పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ కలగలిపి సర్వశక్తి సంపన్నుడుగా, వివేకం, విచక్షణ గల వ్యక్తిగా ఎదగడానికి తనకు తానే గురువుగానూ, దైవం గానూ పరిణమించాలి. అప్పుడే, యువత వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులను తట్టుకుని స్వయం ప్రతిభతో విరాజిల్లగలదు.- డాక్టర్ గోపాలకృష్ణ కొవ్వలిసీనియర్ శాస్త్రవేత్త, అమెరికా -
భారత్‌కు చేరిన డాక్టర్ రామమూర్తి
18 నెలల క్రితం లిబియాలో కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు భారత్‌లో విస్తరించే ప్రణాళికతో ఐసిస్ ఉంది: రామమూర్తి న్యూఢిల్లీ: లిబియాలోని ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డ తెలుగు వైద్యుడు డాక్టర్ కోసనం రామమూర్తి శనివారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన రామమూర్తి.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో స్థిరపడ్డారు. డాక్టర్‌గా పనిచేయడానికి లిబియా వెళ్లిన ఆయనను 18 నెలల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐసిస్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయనకు బుల్లెట్ గాయమైంది. స్వదేశానికి సురక్షితంగా చేరిన రామమూర్తి ఢిల్లీలో మాట్లాడుతూ... భారత్‌లో విస్తరించాలనే ప్రణాళికతో ఐసిస్ ఉందని చెప్పారు. ఐసిస్ ఉగ్రవాదులతో సంభాషణల్ని బట్టి భారత విద్యావ్యవస్థ, ఆర్థిక వృద్ధి వారిని ఎంతగానో ఆకట్టుకుందనే విషయం అర్థమైందన్నారు. వారి ప్రణాళికలు ఏమిటో తనకు చెప్పలేదన్నారు. తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, వాళ్ల చేసిన అకృత్యాలకు సంబంధించిన వీడియోలు చూడాలని ఒత్తిడి చేశారని చెప్పారు. ఐసిస్ కోసం పనిచేయమని వారు కోరారని, అయితే తనకు అలాంటి అనుభవంలేదని చెప్పానని వెల్లడించారు. తనను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ భద్రతా సలహాదారుకు రామమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. -
స్వతహాగా నేను తెలివైనవాణ్ణే కానీ...
'స్వతహాగా నేను తెలివైనవాన్నే. కానీ ఈ విద్యావ్యవస్థ నన్ను నాశసనం చేసింది'- ఓ కుర్రాడు వేసుకున్న టీ-షర్టుపై ఉన్న కొటేషన్ ఇది. వర్తమాన సమాజంలో విద్యావ్యవస్థ తీరు చూస్తే ఈ మాట నిజమేననిపిస్తోంది. మార్కెట్ అవసరాలు తీర్చే మానవ వనరులను తయారుచేసే కార్మాగారాలుగా విద్యాలయాలు మారిపోతున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్టూడెంట్ సర్వోతోముఖాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే చదువులు అంజనం వేసి వెతికినా దొరికే పరిస్థితి కనిపించడం లేదిప్పుడు. డబ్బు సంపాదించే యంత్రాల్లా విద్యార్థులను తయారుచేస్తున్న పాఠశాలలే ఎక్కువయ్యాయి. 'వికాసం మిథ్య- లాభార్జనే ధ్యేయం'గా ఇటువంటి స్కూల్స్ నడుస్తున్నాయి. తమ లక్ష్యాలను నెరవేర్చకునేందుకు విద్యార్థులపై బలవంతపు చదువులు రుద్దుతున్నాయి. ఇష్టంలేని పాఠాలు వల్లించలేక, తల్లిదండ్రుల ఆశలు మోయలేక ఒత్తిడికి గురై విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలవుతున్నారు. అవమానభారంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు ఏడుగురు విద్యార్థులు ఇదే కారణంతో ఆత్మహత్యకు పాల్పతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. పరీక్ష తప్పడంతో 2013లో దేశంలో 2,471 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని జాతీయ నేరాల నమోదు విభాగం తాజా నివేదిక వెల్లడించింది. 2012లో ఈ సంఖ్య 2,246గా ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఆత్మహత్యల్లో సగటున విద్యార్థుల సంఖ్యే 6.2 శాతంగా ఉండడం విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. విద్యార్థుల మోధో వికాసానికి దోహదం చేయాల్సిన విద్య వారి పాలిట వరంగా మారేవరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.