PC: BCCI/IPL
ఐపీఎల్-2026 తొలి ఫైనలిస్టు ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో మట్టికరిపించి.. ఫైనల్లో అడుగుపెట్టింది.
అయితే, ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ గుజరాత్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం మిగిలే ఉంది. ఇక బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌తో గుజరాత్‌తో తలపడేది ఎవరన్న అంశం తేలిపోనుంది.
రిజర్వ్ డేలు ఉండవు
ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. మరి ఈ నాకౌట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏమిటి?.. కాగా ఐపీఎల్‌లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉండవు.
కాబట్టి వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైతే.. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ నేరుగా క్వాలిఫయర్-2లో అడుగుపెడుతుంది. కాగా సన్‌రైజర్స్ లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది గెలిచి మూడో స్థానంలో ఉండగా.. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిది విజయాలు సాధించి నాలుగో స్థానంతో ముగించింది.
వాతావరణం ఎలా ఉందంటే?
అయితే, చండీగఢ్‌లో మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. సగటుల 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదువుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక సాయంత్రం వేళ కూడా దాదాపు 32 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్‌కు వేదికైన ముల్లన్‌పూర్‌లో వర్షం పడే సూచనలైతే దాదాపుగా లేవు.


