కమిన్స్- వైభవ్ (PC: IPL)
ఐపీఎల్-2026లో ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ ఇందుకు వేదిక.
లీగ్ దశలో హైదరాబాద్ తొమ్మిది విజయాలు.. సాధించగా రాజస్తాన్ ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ముఖాముఖి పోరులో ఈ సీజన్‌లో రెండుసార్లూ హైదరాబాద్ జట్టే రాజస్తాన్‌పై పైచేయి సాధించింది.
తొలుత సొంతమైదానం ఉప్పల్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్.. జైపూర్‌లో ఆతిథ్య జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్ పోరులో రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలకం కానున్నాడు.
36 బంతుల్లోనే శతక్కొట్టి..
ఉప్పల్ మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే వైభవ్‌ను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపగా.. జైపూర్‌లో వైభవ్ అతడి బౌలింగ్‌లో చితక్కొట్టాడు. అంతేకాదు.. 36 బంతుల్లోనే శతక్కొట్టి.. లీగ్‌లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము పక్కాగా వ్యూహాలు రచించామని సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పడం విశేషం. జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒక బౌలర్‌గా మన బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోగలను.
వైభవ్ కోసం ప్లాన్ బి, సి కూడా
ఓ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని భావిస్తే.. అతడి కోసం ప్లాన్ బి, సి కూడా సిద్ధం చేసుకోవాలి. వైభవ్ కోసం కచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. గత మ్యాచ్‌లో అతడు మా జట్టుపై సెంచరీ చేయొచ్చు.
అయితే, అంతకంటే ముందు మ్యాచ్‌లో మేము అతడిని నిలువరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్నిసార్లు బౌలర్.. మరికొన్నిసార్లు బ్యాటర్ పైచేయి సాధిస్తారు. గత అనుభవం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదు’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.
ఇక గ్రూప్ దశలో రాయల్స్‌ను రెండుసార్లు ఓడించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని.. అయినా సరే ఈసారి మరింత జాగ్రత్తగా ఆడతామని కమిన్స్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఇక ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో గుజరాత్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఆర్సీబీతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.


