మూడు ‘కీలక యుద్ధాలు’ గెలిచిన ఆర్సీబీ.. పదునైన వ్యూహాలు! | RCB Hit Gujarat Titans Biggest Choke Points Won 3 Tactical Battles Enter Final | Sakshi
Sakshi News home page

మూడు కీలక యుద్ధాలు గెలిచిన ‘ఆర్సీబీ’.. పదునైన వ్యూహాలు!

May 27 2026 12:17 PM | Updated on May 27 2026 1:08 PM

RCB Hit Gujarat Titans Biggest Choke Points Won 3 Tactical Battles Enter Final

ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్థాయికి తగ్గట్లు రాణించింది. తొలి టైటిల్‌ కోసం కళ్లు కాయలు కాచేలా 18 ఏళ్లు వేచి చూసిన బెంగళూరూ జట్టు.. వరుసగా రెండో ట్రోఫీ వేటలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 

లీగ్‌ దశలో అద్భుత ఆటతో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన ఆర్సీబీ.. మంగళవారం నాటి తొలి క్వాలిఫయర్‌లోనూ అసాధారణ ప్రదర్శన కనబరిచింది.

ధర్మశాల వేదికగా అద్వితీయ ఆట తీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆర్సీబీ తొలి టైటిల్‌ అందించిన కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ కీలక మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. తద్వారా ‘ప్లే ఆఫ్స్‌’లో అత్యధిక స్కోరు (254) నమోదు చేసిన ఆర్సీబీ విజయం లాంఛనంగా మారిపోయింది. 

ఆపై 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 6 ఓవర్లు ముగిసేసరికే 51/5తో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్‌–1లో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

మూడు కీలక ‘యుద్ధాలు’ గెలిచిన ఆర్సీబీ
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మూడు కీలక ‘యుద్ధాలు’ గెలిచింది. గుజరాత్‌ నమ్ముకున్న బౌలింగ్‌ ‘ఆయుధాన్ని’ ధ్వంసం చేసి.. మెరుపులు మెరిపించడంలో సఫలమైంది. ప్రత్యర్థి ఫీల్డింగ్‌ తప్పిదాలను క్యాష్‌ చేసుకుంది. ఇక తమ బౌలింగ్‌ అస్త్రాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పాటీదార్‌ పూర్తిగా సఫలమయ్యాడు.

అంచనాలు తలకిందులు
క్వాలిఫయర్‌-1కు ముందు భారత మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఆర్సీబీకి కీలక సూచన చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ దళం ఆర్సీబీ కంటే బలంగా ఉంది కాబట్టి.. జాగ్రత్త వహించాలన్నాడు.

సెహ్వాగ్‌ మాటలు అక్షరాలా నిజం. ఐపీఎల్‌-2026లో క్వాలిఫయర్‌ ముందు వరకు గుజరాత్‌ బౌలింగ్‌ దళం అద్భుతంగా రాణించింది. ప్లే ఆఫ్స్‌నకు ముందు పవర్‌ ప్లేలో అంటే.. తొలి ఆరు ఓవర్లలో కలిపి గుజరాత్‌ 30 వికెట్లు కూల్చింది. కగిసో రబాడ సారథ్యంలో సీజన్‌లోనే అత్యంత ప్రతిభావంతమైన బౌలింగ్‌ దళంగా నిలిచింది.

రబాడ ఒక్కడే పవర్‌ ప్లేలో 17 వికెట్లు తీయడం విశేషం. అతడికి తోడుగా సిరాజ్‌ 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. కానీ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ గుజరాత్‌ బౌలింగ్‌ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. కొత్త బంతితో మ్యాజిక్‌ చేయగలమన్న వారి నమ్మకంపై నీళ్లు చల్లింది.

మెరుపు బ్యాటింగ్‌... బౌలింగ్‌ ‘వెపన్‌’ ధ్వంసం
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (33 బంతుల్లో 93 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌ ప్రదర్శన చేయగా... విరాట్‌ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

గుజరాత్‌ పేసర్‌ సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించిన వెంకటేశ్‌ అయ్యర్‌ (7 బంతుల్లో 19; 3 ఫోర్లు,1 సిక్స్‌)... రబాడ వేసిన మరుసటి ఓవర్లో ఒక సిక్స్‌ బాది మరుసటి బంతికే వెనుదిరిగాడు. 

కోహ్లి తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడగా... రబాడ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో పడిక్కల్‌ ధాటిని చూపించాడు. రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు సాధించింది.

ఆ తర్వాత హోల్డర్‌ ఒకే ఓవర్లో కోహ్లి, పడిక్కల్‌లను వెనక్కి పంపించాడు. ఈ దశలో బెంగళూరుపై టైటాన్స్‌ బౌలర్లు ఒత్తిడి పెంచారు. అయితే కుల్వంత్‌ వేసిన 15వ ఓవర్‌తో ఆట మారిపోయింది. పాటీదార్‌ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిపోగా, చివరి 6 ఓవర్లలో జట్టు ఏకంగా 114 పరుగులు సాధించడం విశేషం.

RCB Vs GT: గుజరాత్‌పై 92 పరుగుల భారీ విజయం.

ప్రయోగం వికటించింది
ఇక గత సీజన్‌లో ఒకే ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన తర్వాత ఈ ఏడాది నేరుగా కుల్వంత్‌ను ప్లే ఆఫ్స్‌లో దించి గుజరాత్‌ సాహసం చేసింది. తన తొలి ఓవర్లో అతడు 3 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. 

అయితే అతని రెండో ఓవర్‌ మ్యాచ్‌ గతిని మార్చింది. ఈ ఓవర్లో కృనాల్‌ 2 ఫోర్లు కొట్టగా, పాటీదార్‌ వరుసగా 4, 6, 4 బాదాడు. దీనికి తోడు అతను 2 నోబాల్, 1 వైడ్‌ కూడా వేశాడు. చివరకు 9 బంతుల ఈ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి.  

ఆ క్యాచ్‌ పట్టి ఉంటే... 
పాటీదార్‌కు 2 లైఫ్‌లు రాగా అతడు వాటిని అద్భుతంగా వాడుకున్నాడు. పాటీదార్‌ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రసిధ్‌ ఓవర్లో కొట్టిన షాట్‌కు బంతి గాల్లోకి లేచింది. బట్లర్‌ ఒక వైపునుంచి పరుగెత్తుకు రాగా, మరో వైపు నుంచి కుల్వంత్‌ వచ్చాడు.

చివరకు ఇద్దరూ దానిని అందుకోలేకపోగా బంతి వారి మధ్యలో పడింది. అదే ఓవర్లో స్కోరు 18 పరుగుల వద్ద పాటీదార్‌ కొట్టిన పుల్‌ షాట్‌కు నేరుగా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను రబాడ వదిలేశాడు.  

గుజరాత్‌ టాపార్డర్‌, మిడిలార్డర్‌ కుదేలు
ఆర్సీబీ విధించిన భారీ లక్ష్య ఛేదనలో టైటాన్స్‌ పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (2)ను భువనేశ్వర్‌ కుమార్‌ పెవిలియన్‌కు పంపగా.. సాయి సుదర్శన్‌ను జేకబ్‌ డఫీ అవుట్‌ చేశాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జోస్‌ బట్లర్‌ (29)ను జోష్‌ హాజిల్‌వుడ్‌ వెనక్కి పంపాడు. ఇలా టాపార్డర్‌ను కుదేలు చేసిన ఆర్సీబీ బౌలింగ్‌ దళం.. మిడిలార్డర్‌ను కనీసం ఊపిరి కూడా పీల్చుకోనివ్వలేదు. నిశాంత్‌ సంధు (5), జేసన్‌ హోల్డర్‌ (0)లను రసిఖ్‌ సలామ​ దర్‌ అవుట్‌ చేయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ (8)ను డఫీ పెవిలియన్‌కు చేర్చాడు.

రాహుల్‌ తెవాటియా పోరాటం
అయితే, లోయర్‌ ఆర్డర్‌లో రాహుల్‌ తెవాటియా తన అనుభవాన్ని చూపించాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించి.. గుజరాత్‌ స్కోరు కనీసం 150 పరుగుల మార్కు దాటేందుకు సహాయపడ్డాడు. అయితే, భువీ తన అద్భుత బౌలింగ్‌తో తెవాటియాను వెనక్కి పంపాడు.

మిగిలిన వాళ్లలో రషీద్‌ ఖాన్‌ (8) వికెట్‌ను డఫీ దక్కించుకోగా.. కృనాల్‌ పాండ్యా.. కగిసో రబాడ (9), సిరాజ్‌ (5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి జేకబ్‌ డఫీ, భువనేశ్వర్‌ కుమార్‌, హాజల్‌వుడ్‌ వరుసగా ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్‌ తీయగా... రసిఖ్‌ సలామ్‌ తన తొలి ఓవర్లోనే ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీసి టైటాన్స్‌ ఆశలు ముగించాడు. గుజరాత్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

మరో అవకాశం
అయితే, ఓడినా గుజరాత్‌ ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. ముల్లన్‌పూర్‌లో బుధవారం జరిగే ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెన్‌ రాజస్తాన్ రాయల్స్‌) విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌–2లో గుజరాత్‌ జట్టు తలపడుతుంది.  మరోవైపు.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జోరు మీదున్న బెంగళూరును టైటిల్‌ పోరులో ఏ జట్టయినా నిలువరించగలదా అనేదే ఇప్పుడు ఆసక్తికరం! 

చదవండి: ఇప్పట్లో అతడిని టెస్టులకు ఎంపిక చేయొద్దు: గంగూలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement