భారత క్రికెట్ నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడేనన్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వైభవ్‌కు ఇప్పట్లో చోటు ఇవ్వడం సరికాదన్నాడు.
అదే విధంగా.. టీ20 ఫార్మాట్‌కు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందని తాను ఊహించలేదని గంగూలీ తెలిపాడు. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి తన సహచర ఆటగాళ్లు సైతం దీనిని అంచనా వేయలేకపోయారని.. తమ తరం ఆట తీరు వేరుగా ఉండేదన్నాడు.
త్వరలోనే జాతీయ జట్టులోకి!
కాగా పన్నెండేళ్ల వయసులోనే దేశీ రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలతో సత్తా చాటాడు. ఇక భారత్ అండర్-19 జట్టు తరఫునా.. అదే విధంగా ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన పదిహేనేళ్ల వైభవ్ త్వరలోనే జాతీయ జట్టులోకి రానున్నాడు.
ఇటీవల సెలక్టర్లు వైభవ్‌ను భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన గంగూలీకి వైభవ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..
అప్పటిదాకా టెస్టులకు ఎంపిక చేయొద్దు
‘‘టీ20 జట్టులోకి అతడు తప్పక రావాల్సిందే. కానీ టెస్టు జట్టులో ఇప్పట్లో అతడికి చోటు ఇవ్వకూడదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మరిన్ని పరుగులు రాబట్టి.. తనను తాను నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయాలి.
అయితే, అతడు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్. పదిహేనేళ్ల వయసులోనే ఈ రేంజ్‌లో ప్రపంచస్థాయి బౌలర్లపై విరుచుకుపడటం నిజంగా ఆశ్చర్యకరం. భారత క్రికెట్ భవిష్యత్ అతడే’’ అని గంగూలీ ప్రశంసలు కురిపించాడు.
అస్సలు ఊహించలేదు
ఇక 25 ఏళ్ల టీ20 ఫార్మాట్ ఈ స్థాయికి చేరుతుందని ద్రవిడ్, టెండుల్కర్‌లతో పాటు మీరూ ఊహించారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘అస్సలు ఊహించలేదు. మేము ముగ్గురమే కాదు.. మాతో పాటు రిక్కీ పాంటింగ్, కుమార్ సంగక్కర, జో రూట్, అలిస్టర్ కుక్ కూడా బహుశా ఇది ఊహించి ఉండరు.
మాదొక విభిన్నమైన తరం. అయితే, ఆటలోనైనా.. ఇతర ఏ రంగంలోనైనా మార్పులు సహజం. కాబట్టి పరిస్థితులకు తగినట్లు ఆటగాళ్లు మారుతూనే ఉండాలి. టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్లు గొప్పగా రాణిస్తున్నారు.
లైన్‌కు తగినట్లు ఆడుతూ.. బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే వారి ముందున్న లక్ష్యం’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగి లీగ్ దశలో ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లో) కూడా ఉంది.


