టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించిన సూర్యకుమార్.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్-2026లో కూడా సూర్య తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
13 ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం 270 పరుగులు సాధించాడు. ఇప్పుడు అతడు తన పేలవ ఫామ్ కారణంగా భారత టీ20 కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత కెప్టెన్‌గా అతడి భవిత్యవం తేలిపోనుంది.
ఈ సిరీస్‌లోనూ సూర్య విఫలమైతే భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ రావడం ఖాయం కానుంది. ఇక తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి సూర్యకుమార్‌కు మరో అద్భుత అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ముంబై టీ20 లీగ్-2026లో ‘ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్’ ఫ్రాంచైజీ తరఫున సూర్య బరిలోకి దిగనున్నాడు.
ఉగాండా పై ఆడనున్న సూర్య
కాగా ఈ టోర్నీ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ ఉగాండాపై ఆడనున్నాడు. ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఉగాండా 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ముంబై లీగ్‌లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఉగాండా తమ తొలి మ్యాచ్‌లో మే 30న ‘ట్రయంఫ్ నైట్స్’ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్స్ తరపున సూర్య ఆడనున్నట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్ ట్రయంఫ్ నైట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఉగాండాపై అతడు ఆడే అవకాశముంది. సూర్య ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు ఏ జట్టుపై ఆడినా, అది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని ఎంసీఎ కార్యదర్శి ఉన్మేష్ ఖాన్విల్కర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.


