రామచంద్రాపురం(పటాన్ చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ చెలికుంట చెరువులో చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నివాసాలకు చెందిన మురికి నీరు చేరడంతో పాటు బహుళ అంతస్తుల భవనాలకు చెందిన వ్యర్థాలను చెరువులో వేయడంతో చేపలు మృతి చెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చెరువులోకి మురుగునీరు చేరుతుందని అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు తెలిపారు. దీంతో సుమారు 7 టన్నుల చేపలు మృతి చెందాయని మత్స్యకారులు వాపోతున్నారు. చేపల మృతికి గల కారణాలను అధికారులు తెలుసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.


