ఓటెత్తారు | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తారు

Feb 12 2026 11:35 AM | Updated on Feb 12 2026 11:35 AM

ఓటెత్తారు

ఓటెత్తారు

సగటున 11 మున్సిపాలిటీల్లో ఉత్సాహంగా ఓటు హక్కునువినియోగించుకున్న పట్టణ ఓటర్లు పలువార్డుల్లో తోపులాటలు..వాగ్వాదాలు.. ఉద్రిక్తతల నడుమ సాగిన పోలింగ్‌ రేపు ఓట్లలెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక అంకానికి తెరపడింది. బుధవారం జరిగిన పోలింగ్‌కు పుర ఓటర్లు పోటెత్తారు. తోపులాటలు..పరస్పర వాగ్వాదాలు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.. పోలీసు రంగప్రవేశాలు..చెదురు మదురు ఘటనల నడుమ మున్సిపల్‌ పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డితో పాటు, జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతల మధ్య ఓటింగ్‌ జరిగింది. జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు జరిగిన పోలింగ్‌ ప్రక్రియలో పుర ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు. మొత్తం 541 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా యువత, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఓట్లు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ఉదయం 9.30 గంటల వరకు మందకొడిగా సాగింది. పది గంటల తర్వాత నుంచి పోలింగ్‌ ఊపందుకుంది. 12 గంటల ప్రాంతంలో పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కాస్త మందగించిన ఓటింగ్‌ మళ్లీ ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య సంగారెడ్డి మున్సిపాలిటీతోపాటు, పలు పట్టణాల్లో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ తీరును పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షించారు.

జిన్నారంలో

అత్యధికం..

జిన్నారం మున్సిపాలిటీలో అత్యధికంగా 91% పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో 70.06% పోలింగ్‌ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిన్నారం మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనమైన విషయం విదితమే. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో జిన్నారంలో అత్యధికంగా 90.09% నమోదైనట్లు తెలుస్తోంది.

రేపే అభ్యర్థుల భవితవ్యం తేలేది..

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. వీరి భవితవ్యం శుక్రవారం తేలనుంది. బ్యాలెట్‌ బాక్సులను అధికారులు పోలీసు బందోబస్తు నడుమ కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న

ప్రముఖులు..

మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట్‌ మున్సిపాలిటీలోని మార్కెట్‌యార్డు పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదాశివపేటలోని 10వ వార్డు పోలింగ్‌ కేంద్రంలో చింతా ప్రభాకర్‌, సంగారెడ్డిలోని పాతజైలు వద్ద ఉన్న పోలింగ్‌బూత్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.

ఒకే కేంద్రంలో తల్లీ కూతుళ్లు

నారాయణఖేడ్‌: రేణుకూరు పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్న మాసాని పద్మ, సిర్గాపూర్‌ మండలం జీవులాతండా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మాసాని స్నేహ ఇద్దరూ తల్లీ కూతుళ్లు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా వీరద్దరికీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల విధులు పడ్డాయి. శాసీ్త్రనగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 7వ వార్డుకు సంబంధించిన 13వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో లోపల స్నేహ, బయట ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తల్లి పద్మ బుధవారం ఎన్నికలు విధులు నిర్వర్తించారు.

కదల్లేని స్థితిలో కదిలించే చైతన్యం

అంబులెన్స్‌లో వెళ్లి మరీ ఓటేసి

జహీరాబాద్‌: అనారోగ్యం కారణంగా శరీరం సహకరించక లేవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ బుధవారం పోలింగ్‌ కేంద్రానికి అంబులెన్స్‌లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జహీరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన ప్రేమలమ్మ కొద్దికాలంగా కదల్లేని స్థితిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాలని ప్రేమలమ్మ కోరడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ఆమెను అక్కడకు తీసుకెళ్లారు. పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లలేని పరిస్థితిని గమనించిన అధికారులు ఆమె అంబులెన్స్‌లోనే ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో ఉన్నా ఓటు హక్కును వినియోగించుకుని ఓటు విలువను చాటిచెప్పిన ప్రేమలమ్మను ఆర్డీఓ దేవుజా అభినందించారు.

76.01 శాతం పోలింగ్‌ నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement