‘ఒకప్పుడు దంపతులు కలిసి ఉండటానికి రాజీ కుదర్చాల్సిన పరిస్థితులు కనిపించేవి. ఇప్పుడు జంటలు విడిపోవడానికి అధిక శాతం రాజీ పడుతున్నారు’ అంటున్నారు న్యాయ నిపుణులు. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూసి,విడాకులకువచ్చేవారి సంఖ్య పెరుగుతోంది అంటున్నారు. భార్య కుక్కలు పెంచుతోందని భర్త విడాకులకు వెళ్లడం, బ్యూటీ పార్లర్ ఖర్చు కోసం భరణం ఎక్కువ ఇవ్వాలని భార్య తిరిగి కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్యలే అయ్యాయని అంటున్నారు. వైవాహిక బంధంలో వస్తున్న ఈ పెనుమార్పులు రాబోయే కాలానికి ఈ యేడాది చెబుతున్న కొత్త భాష్యం..
‘‘ఈ యేడాది న్యాయపరంగా చూస్తే విడాకుల సంఖ్య బాగా పెరిగింది. సెక్షన్ 490ఎ కింద వరకట్న కేసులు కోర్టులలో చాలా సులువుగా వీగిపోతున్నాయి. ఇప్పుడు జాతీయ లోక్ అదాలత్‌లో చాలావరకు ఈ కేసులను నిర్వహిస్తున్నారు. ఇరువైపుల వాళ్లు ఈ విషయంలో రాజీ కుదుర్చుకొని, డబ్బు విషయాలలో ఒక ఒప్పందానికి వచ్చి, త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. దీని వల్ల కోర్టులకు పనిభారం కూడా తగ్గింది’’ అంటున్నారు న్యాయనిపుణులు ఈమని పార్వతి.

సమయానికే ప్రాధాన్యత
చిన్న వయసు జంటలు విడాకులకు లాయర్లను సంప్రదించే వారి శాతం బాగా పెరిగింది. దంపతులలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరిలోనూ ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ గ్యాప్‌ని పూరించడానికి చాలా సమయం పట్టవచ్చు. సమయం వృథా అయ్యేలా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారు. డబ్బు, సమయం, పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగడం.. నవతరానికి నచ్చడం లేదు. అందుకే విడాకులు తీసుకునే సందర్భంలో డబ్బు పంపకాలలో ఒక కచ్చితమైన ధోరణి ఉండేది. ఉదాహరణకు... ఒక విడాకుల కేసులో అమ్మాయి తనకు పది లక్షలు ఇవ్వాలని ముందు పంతం పట్టినా రెండు మూడు సిట్టింగ్‌లలో 5–6 లక్షలకు రాజీకి వచ్చేస్తుంది.
విడాకులకు ఏదైనా కారణమే...!
ఇంత చిన్న విషయానికే బంధాన్ని విడగొట్టుకుంటారా అనిపించే హాస్యాస్పదమైన కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ఉదాహరణకి.. ‘ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చి, వాటికి ఆహారం పెడుతూ, వాటితో ఆడుతూ–పాడుతూ ఆనందంగా ఉంటోంది. దీంతో ఖర్చు ఎక్కువైపోయింది, ఆ వాసన భరించలేకపోతున్నాను అని ఆ భర్త ‘నా భార్య నన్ను మానసికంగా టార్చర్ చేస్తుంది, విడాకులు కావాలని’ కోర్టును ఆశ్రయించాడు. అది సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అతని ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోందని ఆమెను హెచ్చరించిన కోర్టు విడాకులు మంజూరు చేయడానికి ఇంకాస్త టైమ్ ఇచ్చింది.
ఒక కేసులో జంటలో ఒకరు మాంసాహారులు, మరొకరు శాకాహారులు. తమ భాగస్వామి నుంచి వచ్చే ఉల్లి, వెల్లుల్లి వాసన నచ్చడం లేదు. ఈ కారణంగా విడాకులకు అప్లై చేశారు. అస్తమానం ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చొని తనను పట్టించుకోవడం లేదని మరొక కేసు ఫైల్ అయ్యింది. ఇలాంటివన్నీ క్రూయల్టీ కింద అంటే మానసిక వేదనకు కారణం అవుతుందనే విషయంగా ఆలోచిస్తున్నారు.
ఒక ఎన్‌ఆర్‌ఐ కేసు విషయంలో... భర్త అమెరికాలో ఉన్నాడు, భార్య ఇండియాకు వచ్చింది. ఆమె తిరిగి వెళ్లడం లేదు. ఆ భర్త అమెరికా నుంచి కేసు ఫైల్ చేశాడు భార్య తిరిగి రావాలని. ఆమెకు ఇష్టం లేక ‘క్రూయల్టీ అమౌంట్’ అనే విషయం మీద కేసు వేసింది. అదేమింటంటే, భర్త తాను పంపే డబ్బుకు ప్రతీ పైసాకు లెక్క అడుగుతున్నాడనేది ఆమె అభియోగం. అతనిపైన క్రిమినల్ కేసు నమోదయ్యింది. హైకోర్టులో కూడా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో అతను సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకున్న ఒకామె భరణం పెంచాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన విషయాలు.. బ్యూటీ΄ార్లర్‌కు వెళ్లడానికి, షాపింగ్ చేయడానికి డబ్బులు సరిపోవడం లేదని కేసు ఫైల్ చేసింది.
సర్దుబాటు «ధోరణి దంపతుల్లో లోపించడం, డబ్బులు, ఇతరుల పట్ల ఆకర్షణ, అవసరాలు పెరగడంతో బంధాలు చాలా సులువుగా విచ్ఛిన్నమవుతున్నాయి. బంధాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తేనే అవి మనుగడ సాధిస్తాయి. విడిపోవడానికి రాజీ చేసుకునేవాళ్లు, కలిసుండే విషయంలో ప్రయత్నిస్తే దాంపత్య జీవనం సామాజికంగానూ పటిష్టంగా
ఉంటుంది.
పిల్లలు ఉన్నా.. ఒత్తిడి లేదు..
విడాకులు తీసుకోవాలనుకున్న జంటలకు పిల్లలు ఉంటే, వారిపై తమ ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనే ఒత్తిడి ఈ రోజుల్లో లేదు. ఇరువైపుల ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటున్నారు. వారు కూడా సంతానం నిర్ణయాన్నే ఆమోదిస్తున్నారు. విడాకులు తీసుకున్న జంటలకు పిల్లల కస్టడీ గురించి పెద్ద సమస్యలు లేవు. విజిటింగ్ రైట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితం చూసుకుంటూ, తమ పిల్లల విషయంలో సమాన బాధ్యతలు నిర్వర్తించేందుకు మొగ్గు చూపుతున్నారు.
పెరిగిన సహజీవనాలు
2022లో దీపక్ శర్మ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వివాహేతర సంబంధాలలో సమాజం ప్రకారం అనైతికం కానీ, చట్టరీత్యా శిక్ష పడేటటువంటి నేరం కాదు అనేది వచ్చింది. అయితే, అందరి విషయాల్లో కాదు, కొన్ని సందర్భాలలో మాత్రమే అని కూడా చె΄్పారు. కానీ, చట్టాన్ని ఒక సాకుగా చూపుతున్నారు. లివింగ్ రిలేషన్ కూడా పెరిగింది. సమస్య వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నారు. దూరం అయినప్పుడు లైంగిక హింస, రేప్ వంటి కేసులు వస్తున్నాయి. ఇద్దరు ఒక ఇష్టప్రకారం ఉండి, ఎవరో ఒకరికి నష్టం జరిగినప్పుడు తట్టుకోలేక కేసులు ఫైల్ అవుతున్నాయి. అయితే, ఈ కేసులు అంతగా నిలబడటం లేదు.


