
కొత్త రికార్డు స్థాయికి బంగారం
ఢిల్లీ మార్కెట్లో రూ.1,23,300
అంతర్జాతీయంగా ఔన్స్ 3,994 డాలర్లు
రూ.1,57,400కు చేరిన వెండి
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.
బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్‌డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్‌కు తోడయ్యాయి’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్‌కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్‌వాలా తెలిపారు.
నాన్ స్టాప్ ర్యాలీ...
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025
సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం.