
ఏడాదిగా పసిడి నాన్ స్టాప్ ర్యాలీ
ఐదేళ్లలో రెట్టింపునకు పైగా పెరుగుదల
రూ.2 లక్షలకు చేరుతుందని అంచనా
ఆభరణ ప్రియులకే కాదు, ఇన్వెస్టర్లు, చివరికి సెంట్రల్ బ్యాంకులకు సైతం పసిడిపై మక్కువ పెరిగింది. ఫలితంగా ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్న రీతిలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా 2025లోనే పసిడి ధర 50 శాతం, వెండి ధర 55 శాతం చొప్పున పెరిగాయి. బంగారం ధర గత డిసెంబర్ చివరికి ఉన్న రూ.78,950 నుంచి చూస్తే 10 గ్రాములపై నికరంగా రూ.39,950 ర్యాలీ చేసింది.
వెండి సైతం కిలోకి నికరంగా రూ.49,900 మేర ఈ ఏడాది పెరిగింది. ఈక్విటీ, డెట్.. ఇలా ఏ ఇతర సాధనంతో పోల్చి చూసినా గడిచిన ఏడాది కాలంలో బంగారం, వెండి ముందు వెలవెలబోయాయి. గత ఐదేళ్లలో ఎంసీఎక్స్ మార్కెట్లో 24క్యారట్ బంగారం 112 శాతం ర్యాలీ చేసింది. 2020 సెపె్టంబర్ 19న రూ.51,169 వద్ద ఉంటే, ఇప్పుడు రూ.1,09,388కి చేరుకుంది.
ఈ ర్యాలీ చూసి మరింత మంది ఇన్వెస్టర్లు బంగారం, వెండిలో పెట్టుబడులకు ముందుకు వస్తుండడం, సెంట్రల్ బ్యాంకులు సైతం డాలర్ స్థానంలో బంగారానికి వెయిటేజీ పెంచడం ధరలకు మరింత ఆజ్యం పోస్తోంది. గత ఏడాది కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 83.48 నుంచి 88.73కు (6 శాతానికి పైన) పడిపోయింది. బంగారం దిగుమతులపై ఆధారపడడంతో రూపాయి బలహీనత దేశీయంగా అధిక ధరలకు కారణమవుతోంది.
పసిడి @ రూ.1,18,900
ఢిల్లీ మార్కెట్లో పసిడి, వెండి సరికొత్త జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. సోమవారం 10 గ్రాములకు పసిడి (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 లాభపడగా, మంగళవారం మరో రూ.2,700 పెరిగి రూ.1,18,900 స్థాయికి చేరింది. డాలర్‌తో రూపాయి బలహీనత నేపథ్యంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ పెరిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.3,220 పెరిగి రూ.1,39,600 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ ఫ్యూచర్స్‌లో పసిడి ఔన్స్‌కు 36 డాలర్ల వరకు పెరిగి 3,811 డాలర్లకు చేరుకుంది.
టార్గెట్ 2 లక్షలు!
వచ్చే ఏడాది కాలంలో బంగారం ధరలు 15–20 శాతం మేర పెరగొచ్చని త్రివేష్ అంచనా వేశారు. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే, డాలర్ బలహీన పడుతుంది. ఇది బంగారం ధరలు పెరిగేందుకు మద్దతునిస్తుంది’’అని పేర్కొన్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగితే, ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకు డిమాండ్ సంస్థాగతంగా కొనసాగుతుందని, అటువంటి పరిస్థితుల్లో వచ్చే ఐదేళ్లలో 10 గ్రాముల పసిడి ధర రూ.1.7 లక్షలకు చేరుకోవచ్చని మనీష్ శర్మ అంచనా వేశారు.
2026 మధ్య నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,000 డాలర్లను అధిగమించొచ్చన్నారు. 2–5 ఏళ్లలో 5,000 డాలర్లకు వెళ్లొచ్చని (రూ.1,50,000–1,70,000) చెప్పారు. జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్ సైతం బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింత పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఔన్స్‌కు 6,600 డాలర్లకు చేరుకోవచ్చని (ఇక్కడి నుంచి 70 %కి పైన, అంటే మన దగ్గర రూ. 2 లక్షలు) అంచనా వేశారు.
అంతర్జాతీయ అనిశి్చతుల ఆజ్యం..
కరోనా విపత్తు నుంచి పుత్తడి ధరల పెరుగుదల మొదలైంది. ఆ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టడం, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్–పాలస్తీనా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ భౌగోళికంగా అనిశ్చితులను రాజేశాయి. గతేడాది రెండో పర్యాయం అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన డోనాల్డ్ ట్రంప్ సుంకాల పోరుకు తెరతీయడం విలువైన లోహాలకు డిమాండ్‌ను మరింత పెంచింది. సంప్రదాయ డెట్, ఈక్విటీల స్థానంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలోకి పెట్టుబడులను పెంచుతూ రావడం ధరలకు మద్దతుగా నిలుస్తోంది.
అమెరికా రుణ భారం భారీగా పెరిగిపోయిన తరుణంలో డాలర్‌కు బదులు సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో పసిడి ధరలు దిగొస్తాయన్న అంచనాలు తలకిందులవుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు ధరలకు ప్రేరణనిస్తున్నట్టు ఆనంద్‌రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కమోడిటీ విభాగం ఏవీపీ మనీష్ శర్మ చెప్పారు. ‘2005లో 24క్యారట్ బంగారం ధర (10 గ్రాములు) రూ.7,000 వద్ద ఉంది. 2010 నాటికి రూ.18,500కు పెరిగింది. 2015లో రూ.26,300 వద్ద ఉంది. 2025 సెపె్టంబర్‌లో రూ.1,18,000కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 36 శాతం పెరిగాయి. ఈ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే దీర్ఘకాలంలో బంగారం బలంగా నిలబడుతుంంది’ అని చెప్పారు. యూఎస్‌లో లిస్టెడ్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు 215 బిలియన్ డాలర్లకు చేరినట్టు శర్మ తెలిపారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్