బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు! | Gold Shines Bright in 2025 Crosses Rs 1 Lakh Mark | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!

Dec 20 2025 6:06 PM | Updated on Dec 20 2025 6:26 PM

Gold Shines Bright in 2025 Crosses Rs 1 Lakh Mark

ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బంగారం మార్కెట్‌లో చరిత్రాత్మక ఏడాదిగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో తులం (10 గ్రాములు) బంగారం ధర సుమారు రూ.80 వేల స్థాయిలో ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.30 లక్షలకుపైగా చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత, భారతీయ రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం ధరలను కొత్త రికార్డుల వైపు నడిపించాయి. 2025లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయి.. కొత్త మార్కులను ఎలా దాటాయి.. చూద్దాం కథనంలో..

జనవరి: స్థిరమైన ఆరంభం

2025 జనవరిలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.80 వేలు రూ.82 వేల మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ పెద్దగా కదలికలు చూపకపోయినా, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.

మార్చి: వేగం పుంజుకున్న ధరలు

మార్చి నాటికి బంగారం ధరలు రూ.88,000రూ.90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం బంగారాన్ని ‘సేఫ్ హేవన్’గా మార్చాయి.

ఏప్రిల్: చరిత్రాత్మక మైలురాయి

ఏప్రిల్ నెల బంగారం మార్కెట్‌లో కీలక మలుపు. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది. ఒకే రోజులో వేల రూపాయల పెరుగుదల నమోదై, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

మేజూన్: స్వల్ప ఊగిసలాట

మే, జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ రూ.95,000 రూ.98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా, పెట్టుబడి డిమాండ్ మాత్రం కొనసాగింది.

సెప్టెంబర్: మళ్లీ జోరు

సెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని రూ.1.08 లక్షల నుంచి రూ.1.10 లక్షల స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.

అక్టోబర్: పండుగ సీజన్ రికార్డులు

దసరాదీపావళి సీజన్‌లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరి కొత్త ఆల్‌టైమ్ హైని నమోదు చేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కలసి ధరలను ఆకాశానికి చేర్చాయి.

డిసెంబర్: స్వల్ప తగ్గుదల

డిసెంబర్ చివర్లో ధరలు కొంత సర్దుబాటు చెంది రూ.1.28 లక్షలు రూ.1.30 లక్షల పరిధిలో కొనసాగాయి. ఏదేమైనప్పటికీ, ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్ని ఇచ్చిన ఆస్తిగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement