
ఐవోసీ చైర్మన్ ఏఎస్ సాహ్ని వెల్లడి
అమెరికా టారిఫ్‌ల బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికనే ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థలు కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. టారిఫ్‌ల నేపథ్యంలో కొనుగోళ్లను తగ్గించాలని గానీ లేదా మరింతగా పెంచాలని గానీ తమకు ఎలాంటి సూచనలు రాలేదని సాహ్ని చెప్పారు.
రష్యా చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవని, వాటికి విరుద్ధమైనవేమీ భారత్ చేయలేదని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరికి ముందు భారత చమురు దిగుమతుల్లో 1 శాతం కన్నా తక్కువగా రష్యా వాటా ఉండేది. కానీ ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఇంధనంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత నుంచి ఇది 30 శాతానికి పెరిగింది.
ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఐవోసీ రిఫైనరీలు ప్రాసెస్ చేసిన క్రూడాయిల్‌లో 22–23 శాతం వాటా రష్యా దిగుమతులది ఉంటోంది. అటు బీపీసీఎల్ క్రూడాయిల్ రిఫైనింగ్‌లో 34 శాతంగా నమోదైంది. మరోవైపు రష్యా చమురుపై డిస్కౌంట్లు, బ్యారెల్‌పై 1.5 డాలర్లకు తగ్గడంతో గత నెల దిగుమతులు కొంత తగ్గినట్లు బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్సా రామకృష్ణ గుప్తా తెలిపారు.