
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.
అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్‌గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వెల్లడించారు.
రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అని అన్నారు.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
జో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్‌స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు.