నియంత్రణల పరమైన జాప్యం
రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలు అవసరం
అసోచామ్ నివేదిక వెల్లడి
నిబంధనల అమలుకు అధిక వ్యయం చేయాల్సి రావడం, నియంత్రణలపరమైన జాప్యం, అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ లేకపోవడం దేశ ఎంఎస్‌ఎంఈలు వాటి పూర్తి సామర్థ్యాలను చేరుకోలేకపోవడానికి అవరోధాలుగా అసోచామ్ నివేదిక పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) వాటి పూర్తి సామర్థ్యం మేర రాణించేందుకు వీలుగా రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సూచించింది.
జీఎస్‌టీ సంబంధిత అవరోధాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్‌ల్లో జాప్యాలు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో సమస్యలు, లాజిస్టిక్స్ (రవాణా), మౌలిక వసతుల పరమైన అవరోధాలు, ఇ–వే బిల్లుల్లో సమస్యలతోపాటు.. పశ్చిమబెంగాల్, ఒడిశాలో విద్యుత్ సరఫరా పరమైన సమస్యలు ఉత్పత్తి నష్టాలకు కారణమవుతున్నట్టు తెలిపింది. కంపెనీల చట్టం, భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధనలు ఎంఎస్‌ఎంఈలకు భారంగా మారాయంటూ.. ప్రక్రియలు ఎంతో సంక్లిష్టంగా ఉండడం, సర్టిఫికేషన్ జారీలో జాప్యం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబందనల్లో అస్పష్టతలను సైతం ఎంఎస్‌ఎంఈలు రాణించడానికి అవరోధాలుగా ప్రస్తావించింది.
సింగిల్ విండో వ్యవస్థ
సకాలంలో అనుమతులు, ప్రక్రియలు పూర్తి చేసే సింగిల్ విండో వ్యవస్థ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, రాష్ట్రాల స్థాయిలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడుతుందని అసోచామ్ నివేదిక సూచించింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సింగిల్ విండో వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరింది. జాతీయ స్థాయిలోనూ చిన్న వ్యాపార సంస్థలకు నిబంధనల అమలును సమూలంగా మార్చేయాలని పేర్కొంది. చిన్న సంస్థలకు తప్పనిసరి ఆడిట్ నుంచి మినహాయింపులు కల్పించాలని, గ్రేడ్‌వారీగా పెనాల్టీ వ్యవస్థ ఉండాలని సూచించింది. అనుమతులను క్రమబద్దీకరించడం, జీఎస్‌టీ సంస్కరణలు, భూ వినియోగ మార్పిడి అనుమతులను సకాలంలో మంజూరు చేయడం, సౌకర్యవంతమైన కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరింది. అలాగే మౌలిక వసతులను మెరుగుపరచాలని, సులభతర ఇ–వే బిల్లు విధానాన్ని, ప్రత్యేకమైన లాజిస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు


