దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రధాన ముడిచమురు సరఫరాదారుగా ఉన్న రష్యా నుంచి భారత్ దిగుమతులు ఇటీవలికాలంలో గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్ నెలలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు విలువ పరంగా 28.9 శాతం తగ్గి, 2024 సెప్టెంబర్‌లోని 4,675 మిలియన్ డాలర్ల నుంచి 3,322 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా చూస్తే ఈ దిగుమతులు ఏకంగా 17 శాతం తగ్గి 6.6 మిలియన్ టన్నులకు చేరాయి.
తగ్గుదలకు ప్రధాన కారణాలు
రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా జులైలో ఇండియాపై 25 శాతం అదనపు టారిఫ్‌ను విధించింది. అంతకుముందు ఉన్న టారిఫ్‌లతో కలిపి ఇది మొత్తం సుమారు 50 శాతానికి చేరింది. ఈ అదనపు టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతులపై ముఖ్యంగా జౌళి (టెక్స్‌టైల్స్), ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అమెరికా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు ధరల పరంగా తమ పోటీతత్వాన్ని కోల్పోయాయి.
దిగుమతులు తగ్గించుకుంటేనే..
రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటే ఈ టారిఫ్‌లను ఉపసంహరిస్తామని అమెరికా ప్రభుత్వం పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో భారతీయ చమురు సంస్థలు (రిఫైనరీలు) ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించక తప్పలేదు.
రష్యా చమురు సంస్థలపై ఆంక్షలు
అమెరికా ప్రభుత్వం ఇటీవల రష్యాకు చెందిన ప్రధాన చమురు సంస్థలు అయిన రోస్‌నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil) వంటి వాటిపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు కేవలం టారిఫ్‌లు వంటి ధరల పెరుగుదలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ సంస్థలతో ఆర్థిక లావాదేవీలు జరపడం, బీమా (ఇన్సూరెన్స్), రవాణా (షిప్పింగ్) వంటి అంశాలలో భారీ నియంత్రణ సమస్యలను సృష్టిస్తున్నాయి. పాశ్చాత్య ఆంక్షలకు లోబడి పనిచేయడం రిఫైనరీలకు సంక్లిష్టంగా మారడంతో భవిష్యత్తులో సరఫరా భద్రత దృష్ట్యా కొన్ని భారతీయ రిఫైనరీలు (రిలయన్స్ ఇండస్ట్రీస్, మాంగళూరు రిఫైనరీ వంటివి) రష్యా నుంచి కొత్త కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీన్ని కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఎనర్జీ సెక్యూరీటీ, జాతీయ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని వాదిస్తూ భారత్ రష్యా నుంచి చౌకగా లభించిన ముడిచమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యంపై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు, రష్యన్ సంస్థలపై ఆంక్షలు భారతీయ ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో దేశీయ రిఫైనరీలు తమ చమురు వనరుల కోసం ప్రత్యామ్నాయ దేశాలైన అమెరికా, మధ్య ఆసియా దేశాల వైపు మళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: వొడాఫోన్-ఐడియా బకాయిలపై మదింపు చేయవచ్చు.. సుప్రీంకోర్టు


