వొడాఫోన్-ఐడియా (Vi) అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న వొడాఫోన్-ఐడియా అన్ని ఏజీఆర్ బకాయిలను ఫిబ్రవరి 3, 2020 నాటి మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా మదింపు చేసి, సరిదిద్దే(reconcile) అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
కోర్టు స్పష్టత
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు స్పష్టతనిచ్చింది. వొడాఫోన్-ఐడియా తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గి, మహేష్ అగర్వాల్ మౌఖికంగా చేసిన విజ్ఞప్తిపై ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులోని ఆరో పేరాలో అదనపు ఏజీఆర్ డిమాండ్‌ను మాత్రమే సరిదిద్దాలని టెలికాం సంస్థ కోరినట్లు పొరపాటున పేర్కొనబడిందని కంపెనీ కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై అగర్వాల్ స్పందిస్తూ.. తాము అన్ని ఏజీఆర్ బకాయిలను సమగ్రంగా మదింపు చేసి, సరిదిద్దేందుకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీంతో కేంద్రం తమ డిమాండ్‌ను చట్టానికి అనుగుణంగా పునపరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశాన్ని కోర్టు స్పష్టం చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరై వొడాఫోన్‌ఐడియా విషయంలో గత ఏజీఆర్ వ్యాజ్యానికీ, ప్రస్తుత పరిస్థితికీ మధ్య భారీ మార్పు వచ్చిందని తెలిపారు. కంపెనీలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 49 శాతం వాటాను పెట్టుబడిగా పెట్టింది. ఏజీఆర్ బకాయిల అంశం ప్రభుత్వ(ప్రజా ప్రయోజనం), కంపెనీ ప్రయోజనంతో ముడిపడి ఉందని మెహతా వాదించారు. కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా దానికున్న 20 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపుతుందని కూడా కోర్టుకు తెలిపారు.
విధాన పరమైన నిర్ణయం అవసరం..
ప్రభుత్వానికి చెప్పుకోదగిన వాటా ఉండడం, 20 కోట్ల మంది వినియోగదారుల ఉండడంతో ఈ సమస్యపై విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఏజీఆర్ బకాయిలపై సమగ్ర మదింపునకు కేంద్రానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ స్పష్టతతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్-ఐడియాకు కొంత ఊరట లభించినట్లయింది.
ఇదీ చదవండి: బిగ్‌రిలీఫ్.. ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..


