అనంతపురం సెంట్రల్: యూపీఎస్సీ ఫలితాల్లో అనంతపురానికి చెందిన సోమాసి దివ్య అనే యువతి ఆలిండియా స్థాయిలో 394వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి రమేష్ కళ్యాణదుర్గం ఆర్టీఓగా పనిచేస్తున్నారు. నంద్యాలలో 6 నుంచి 10వ తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్, ఐఐటీ– బాంబేలో బీటెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియాలో బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు. తర్వాత యూపీఎస్సీ కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుని రాణించారు.
సేవా రుసుం మూడింతల పెంపు
అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం పేదల జేబుల నుంచి లాక్కుని సంపద సృష్టించే మార్గానికి రాచబాట వేసింది. కొత్త బియ్యం కార్డు, డూప్లికేట్ బియ్యం కార్డు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు కార్డు విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు రుసుంను ఏకంగా మూడింతలు పెంచింది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న రూ.24 సేవా రుసుం కాస్తా రూ.100కు చేరింది. బియ్యం కార్డు విభజనకు ఇప్పటి వరకు తీసుకుంటున్న రూ.48 సేవా రుసుం రూ.200కు పెంచింది. ఇందుకు సంబంధించి సచివాలయ సిబ్బంది గ్రూపుల్లో సమాచారం పంపించింది.


