కదిరి: భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా కదిరిలో పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా, అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన శనివారం స్వామివారు మోహినీ అవతారమెత్తారు. ఈ అవతారంలోని శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు మోహినీ అవతారమెత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వయ్యారాలు ఒలకపోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. ధగ ధగా మెరిసే పట్టు చీరలో అందరినీ అకట్టుకొనే స్వామి వారిని గుభాళించే కదిరి మల్లెలతో అలంకరించారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలక్రిష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పట్టణమంతా ఊరేగనున్న శ్రీవారు
తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిస్తారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై స్వామివారు తన భక్తులకు తిరువీధుల్లో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి రథోత్సవం ఈ నెల 10న జరగనుంది.


