● బండరాయితో మోదిన టీడీపీ నేత
బొమ్మనహాళ్: రెడ్‌బుక్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేయగలం అనే ధీమాతో అరాచకశక్తులుగా మారి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా మండల కేంద్రం బొమ్మనహాళ్‌లో ఎంపీటీసీ సభ్యురాలు శివశంకరమ్మ భర్త యువరాజ్ స్వామిపై టీడీపీ నేత బక్కసూరి హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం మేరకు... యువరాజ్‌స్వామి శనివారం ఉదయం తన కుమారుడు, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై ఓ హోటల్‌కు వెళ్లాడు. టిఫెన్ పార్సిల్ కట్టించుకుని బయటకు వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేత బక్క సూరి.. యువరాజ్‌స్వామిని దూషిస్తూ విరుచుకుపడ్డాడు. ‘ఎక్కడినుంచో బతకడానికి బొమ్మనహాళ్‌కు వచ్చి ఎంపీటీసీ అయ్యారు.. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి కాకుండా వైఎస్సార్‌సీపీకి సపోర్ట్ చేస్తారా.. నీ అంతు చూస్తా.. లం.... కొడకా.. నువ్వు ఎంత రా..’ అంటూ పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడాడు. అక్కడితో ఆగకుండా ద్విచక్ర వాహనంపై కూర్చున్న యువరాజ్‌స్వామిపై బండరాయితో దాడి చేశాడు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. బైక్‌ను సైతం ధ్వంసం చేశాడు. ఈ హఠాత్పరిణామంతో పిల్లలు భయంతో వణికిపోయారు. ఇంతలో అక్కడున్న స్థానికులు కలగజేసుకుని స్వామిని రక్షించారు. అనంతరం బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
కాలవ అండతోనే దాడులు
బొమ్మనహాళ్: టీడీపీ అరాచక పాలన పరాకాష్టకు చేరిందని, వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండదండలతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. బొమ్మనహాళ్‌లో టీడీపీ గూండా బక్క సూరి దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ శివశంకరమ్మ భర్త యువరాజ్‌స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న మెట్టు గోవిందరెడ్డి స్థానిక నాయకులతో కలిసి శనివారం సాయంత్రం బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీ భర్తపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రెండు నెలల క్రితం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అనెగ్జర్ ఫారం 1, 2 సమర్పించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులతో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లినప్పుడు టీడీపీ మూకలు తమ నాయకులపై దాడి చేశారన్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. తామే టీడీపీ నాయకులపై దాడి చేశామంటూ పోలీసులు తప్పుడు కేసులను నమోదు చేశారన్నారు. ఎంపీపీ ఎన్నికలప్పటి నుంచి యువరాజ్‌స్వామి కుటుంబాన్ని టీడీపీ నాయకులు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గూండా బక్క సూరి తన కారుమీద రాయితో దాడి చేశాడని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదన్నారు. ప్రశాంతంగా ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో అరాచకాలకు కాలవ శ్రీనివాసులు ఆజ్యం పోయడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంసీహెచ్ రాజ్‌కుమార్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం సెక్రెటరీ పరమేశ్వర, బీసీ సెల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు పాల్గొన్నారు.


