బతుకుదెరువు కోసం ఊరూరు తిరుగుతూ దుస్తులు అమ్ముకునే ప్రకాశం జిల్లాకు చెందిన చిరువ్యాపారి గోదిన వెంకటేశ్వర్లు(44).. బుధవారం తెల్లవారుజామున పాముకాటుతో పత్తికొండలో మృతి చెందాడు.
బతుకుదెరువు కోసం వచ్చి మృత్యువాత
Jun 21 2017 11:48 PM | Updated on Sep 5 2017 2:08 PM
– పాముకాటుతో ప్రకాశం జిల్లావాసి మృతి
పత్తికొండ టౌన్: బతుకుదెరువు కోసం ఊరూరు తిరుగుతూ దుస్తులు అమ్ముకునే ప్రకాశం జిల్లాకు చెందిన చిరువ్యాపారి గోదిన వెంకటేశ్వర్లు(44).. బుధవారం తెల్లవారుజామున పాముకాటుతో పత్తికొండలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ఇతనితోపాటు మరో నలుగురు కొన్నిరోజుల క్రితం పత్తికొండకు వచ్చారు. ఆదోనిరోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వస్త్ర వ్యాపారం చేసేవారు. టీవీఎస్ మోపెడ్‌పై గ్రామాలకు వెళ్లి దుస్తులు అమ్మి.. రాత్రి పత్తికొండలోని అద్దె ఇంట్లో ఉండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును పాము కరిచింది. వెంటనే లేచిన వెంకటేశ్వర్లు తనను ఏదో కుట్టిందని తనతో పాటు ఉన్నవారికి చెప్పడంతో వారు చూడగా పరుపులో పాము కనిపించింది. పామును వారి చంపివేశారు. వెంకటేశ్వర్లును పక్కనే ఉన్న ఒక ప్రైవేటు నర్సింగ్‌హోంకు తీసుకెళ్లగా వైద్యసిబ్బంది సకాలంలో స్పందించలేదు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతిచెందాడు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీత్రివేణి, లక్ష్మీత్రిష, ఒక కుమారుడు వెంకట గోపీచంద్ ఉన్నారు. ఆయన మృతితో వారి కుటుంబం జీవనాధారం కోల్పోయింది. పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని బంధువులకు అప్పగించి.. పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Advertisement
Advertisement