సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు.
అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం..
.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు..
.. ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది.
ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.


