సాక్షి,అమరావతి: రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్‌ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్) సమావేశంలో ఆయన మంత్రుల పని తీరు, శాఖల నిర్వహణ, కేంద్ర నిధుల సమీకరణపై స్పందించారు.
గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు.



