చెట్ల నరికివేత కంటే దీంతోనే అడవులకు పెనుముప్పు
ప్రపంచవ్యాప్తంగా 73 శాతం తగ్గిపోయిన వన్యప్రాణులు
ప్రమాదం అంచున మరో 3,500 రకాల జాతులు
మేల్కొనకపోతే ఆహార, పర్యాటక, ఆర్థిక రంగాలకు దెబ్బ
వెల్లడించిన ‘ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ ’
సాక్షి, అమరావతి: అడవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పర్యావరణంపై పంజా విసురుతున్నాయి. ఇప్పటివరకు చెట్ల నరికివేత, కాంక్రీట్ జంగిల్‌గా మార్చడమే పచ్చదనం తగ్గడానికి కారణంగా భావించాం. అయితే, ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ అనే సంస్థ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. పలు దేశాలలోని అడవుల్లో రేగుతున్న కార్చిచ్చు పర్యావరణానికి పెను సవాల్‌గా మారిందని పేర్కొంది. గ్లోబల్ ట్రీ కవర్ నష్టం 2023లో పోల్చితే ఏకంగా 370 శాతం పెరిగిందని వివరించింది.
అడవుల్లో చెలరేగిన మంటల కారణంగా 3.1 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడినట్లు తెలిపింది. ఇది మానవ ప్రేరేపిత ఉద్గారాల్లో సుమారు 8 శాతమని, జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించింది. రెండేళ్ల కిందటి పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, మేల్కొనకపోతే పర్యావరణంతో పాటు మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ అధ్యయనం ప్రకారం...
» అమెరికాలోని కాలిఫోర్నియాలో జనవరిలో చెలరేగిన మంటల కారణంగా 57 వేల ఎకరాలకుపైగా దహనమయ్యాయి. 250 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మార్చిలో జపాన్‌లో చెలరేగిన కార్చిచ్చుతో 370 హెక్టార్లలో, దక్షిణ కొరియాలో 48 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా చెలరేగిన మంటలు కెనడాలో 1.58 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని బూడిద చేశాయి. ఇలాంటి సమయంలో భారీగా విడుదలయ్యే కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచుతాయి.
» కార్చిచ్చు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. పొగ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడడంతో పాటు మరణాలు అధికమవుతున్నాయి.
» పలు దేశాల్లో అడవుల్లో ఏదో ఒకరకంగా విధ్వంసం జరుగుతోంది. అమెజాన్‌కు నెలవైన బ్రెజిల్‌లో మొక్కల పెంపకం, పక్కాగా పరిరక్షణ చర్యలు చేపట్టడంతో అడవుల్లో అలజడి తగ్గింది. కానీ, తీవ్రమైన కరువు కారణంగా ఈ ప్రాంతంలో కార్చిచ్చు గణనీయంగా పెరిగింది.
73 శాతం తగ్గిపోయిన వన్యప్రాణులు
ఐదు దశాబ్దాల్లో వన్యప్రాణుల సంఖ్య 73 శాతం పడిపోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులు జీవ వైవిధ్యాన్ని అతలాకుతలం చేశాయి. అడవులు తగ్గిపోవడం భౌగోళిక ప్రాంతంతో పాటు వాటి పరిధిలోని జాతులను ప్రభావితం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా 3,500 కంటే ఎక్కువ వన్యప్రాణుల జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అనేక జాతులు ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
వాతావరణ మార్పులతో ముప్పు
అతిపెద్ద అడవి అమెజాన్ ప్రాంతంలో వచ్చిన వాతావరణ మార్పులు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవులను కాపాడుకోవడంతో పాటు అగ్నికి ఆహుతైన ప్రాంతాల్లో భారీగా పచ్చదనం పెంపు చర్యలు చేపట్టాలి.
ఆర్థిక రంగంపైనా దెబ్బ
అడవుల క్షీణత వల్ల తలెత్తుతున్న పరిణామాలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. వాతావరణ వ్యత్యాసాలు పెరిగి వ్యవసాయం, ఆహార భద్రత, వినోదం, పర్యాటక రంగాలపై ప్రభావం పడుతుంది. వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా జంతువులకు వ్యాధులు సంక్రమించి, వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
పగడపు దీవులపై దాడి
పర్యావరణ మార్పులు ఆఖరికి సముద్రపు జీవుల మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పగడపు దీవులు నాశనమవుతున్నాయి. సముద్రం వేడెక్కడం, మత్స్య సంపదను అతిగా వేటాడడంతో పాటు కాలుష్యం పగడపు దీవులకు శాపంగా పరిణమించింది.


