సాక్షి, అమరావతి: కేంద్ర అధికారుల బృందం ఈ నెల 10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వంలో 8 మంది అధికారులు.. రెండు బృందాలుగా విడిపోయి ఆరు జిల్లాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఈ బృందం 10వ తేదీ ఉదయం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనుంది.
అనంతరం బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒక బృందం, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మరో బృందం పర్యటించి పంట, ఇతర నష్టాలను అంచనా వేయనుంది. ఈ బృందాన్ని సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిగా విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్, రాష్ట్ర స్థాయి లైజనింగ్ అధికారిగా ఈడీ వెంకట దీపక్‌ను నియమించింది.


