నెమ్ముకు నీరెత్తే టైమ్!
హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్!.. జాగ్రత్త
నిమోనియా గురించి దాదాపు మనలో చాలామందికి తెలుసు. అయితే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే మాట అంతగా తెలియదు. కానీ... ఇటీవలి మోంథా తుఫానులా చాలాకాలం పాటు వాతావరణం చల్లగా మందంగా ఉండటం, ఆ తర్వాత మళ్లీ చలికాలం మొదటి రోజులు కావడంతో అదే తరహా చలి కంటిన్యూ కావడం లాంటి వాతావరణం కొనసాగుతున్న రోజుల్లో ఇది ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’గా చెప్పే కొన్ని రకాల న్యుమోనియాలకు అనువైన కాలమిది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోడానికీ, దీని నుంచి అప్రమత్తంగా ఉండటానికీ, దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకే ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. కొన్ని రకాల నిమోనియాలను కలగలపుకొని ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అనవచ్చు. దీని గురించి తెలుసుకునే ముందర మన పల్లెల్లోని కొన్ని నిర్దిష్టమైన చోట్ల వస్తుండే రకరకాల వాసనల వివరాలను చూద్దాం.
అసలు హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ (Hypersensitivity pneumonitis) అంటే ఏమిటి...?
అవి గరిసెలూ, గాదాలైనా, గడ్డివాములైనా, పావురాలూ, పిట్టలుండే పక్షిగూళ్లైనా అక్కడి గాలుల్లో వ్యాపించే వాసనలతో వాతావరణం కలుషితం కావడం, వాటినుంచి గాల్లోకి వ్యాపించే మనుషులకు సరిపడని అనేక కాలుష్య రేణువుతోనూ వచ్చే ఊపిరితిత్తుల సమస్యనే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’గా చెప్పవచ్చు. పైగా ఇటీవల తుఫాను వాతావరణం, చలిగాలుల నేపథ్యంలో గడ్డీగాదం తడిసిపోవడంతో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవడం అవసరమే.
ఒకరకంగా వృత్తిపరం...మరోరకంగా జన్యుపరం...
చూడటానికి ఇదో వృత్తిపరమైన సమస్యగా అనిపించవచ్చు. రైతులు, పౌల్ట్రీ పనివారు, పక్షులు పెంచి జీవనోపాధి పొందేవారు తమ వృత్తులో భాగంగా ఈ సమస్యకు గురికావడంతో మనకు ఇదో వృత్తిపరమైన సమస్య (ప్రొఫెషనల్ హజార్డ్)గా కనిపిస్తుంది. అయితే మరోరకంగా చెప్పాలంటే ఇదో జన్యుపరమైన సమస్య కూడా. ఎందుకంటే... కొంతమందిలో కొన్ని అలర్జెన్స్ సరిపడకపోవడమన్న అంశం వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి వస్తుంటుంది. దాంతో కొన్ని అంశాలకు తీవ్రమైన అలర్జీ ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. అందుకే కొన్ని కుటుంబాల్లోని వారిలో (ఫెమీలియల్‌గా) ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఈ కోణంలో చూసినప్పుడు ఇది జన్యుపరమైన దుష్ప్రభావంగా కనిపించవచ్చు. అయితే సాధారణంగా వయసు పెరుగుతూ వారు 50, 60 ఏళ్ల వయసుకు చేరుతున్నప్పుడు ఈ సమస్య మనుషుల్లో తీవ్రతరమవుతుంటుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ కొంత తగ్గుతుండటం ఇలా జరుగుతుంది. కానీ వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తక్కువగా ఉండి, బాగా బలహీనంగా ఉన్న వాళ్లలో ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ సమస్య ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు.
పల్లెటూళ్లలో గరిసెల్లో వడ్లూ, ఇతర ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, వరిగడ్డితో గడ్డివాము / గడ్డివామి పేర్చే సమయంలో ఆ ప్రదేశంలో ఒక రకమైన వాసనలు వస్తుంటాయి. ఆ వాసనలు వచ్చే చోట వ్యాప్తిచెందే నిమోనియాను ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. అలాగే కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది. అది సరిపడనివారికి ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అనే మరో ఆరోగ్య సమస్య వస్తుంది. అంటే ఈ తరహా సమస్య పౌల్ట్రీల్లో పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు... ఇటీవల చాలామంది ఆరోగ్య నిపుణులూ, డాక్టర్లు ఒక మాట చెబుతుండటాన్ని చాలామంది వినే ఉంటారు. అదే పావురాళ్లకు ఆహారం వేయకండి. వాటి విసర్జకాలతో ప్రాణహాని సైతం కలగవచ్చంటూ హెచ్చరిస్తుండటం చాలామంది దృష్టికి వచ్చే ఉంటుంది. అలా పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఈ తరహా నిమోనియా రావచ్చు.
హైపర్ సెన్సిటివిటీ నిమోనియా వ్యాప్తికి దోహదపడే అంశాలు...
మన పరిసరాల్లో నిత్యం వ్యాపించి ఉండే దాదాపు 300 రకాల రేణువులూ, కాలుష్య పదార్థాలు ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణమయ్యే అవకాశముంది. కొంతమందికి కొన్ని పదార్థాలూ, అంశాల వల్ల అలర్జీ కలగడం మనకు తెలిసిందే. ఏ అంశాల వల్ల అలర్జీ కలుగుతుందో వాటిని అలర్జెన్స్ అంటారు. ఆ అలర్జెన్స్‌ను వర్గీకరించినప్పుడు నాలుగు రకాల నిమోనియాలు వచ్చేందుకు అవకాశముంది. అవి...
ఫార్మర్స్ లంగ్: ఇది చాలావరకు రైతుల్లో కనిపిస్తుంది. పంటకోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని గరిసెల్లో నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, గడ్డివాముల్లాంటివి పేర్చాల్సి వస్తుండటం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు.
బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్: జీవనోపాధి కోసం కొందరు పక్షుల్ని పెంచుతుంటారు. ప్రధానంగా పౌల్ట్రీ రంగంలోని వారూ, అలాగే హాబీగా మరికొందరు పెద్దసంఖ్యలో పక్షుల పెంపకం చేస్తుంటారు. ఇక మరికొందరు సరదాగా పక్షులకు ఆహారం వేసి ఆనందిస్తుంటారు. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా పావురాళ్లకు ఆహారం వేస్తుంటారు. అలాంటి చోట్లలో పక్షుల వాసనా, వాటి వ్యర్థాల వాసనతోనూ, వాటి విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’గా చెబుతుంటారు.
హ్యుమిడిఫయర్స్ లంగ్: కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి రావడమో లేదా నివాసం ఉండాల్సి రావడమో జరగవచ్చు. అక్కడి తేమ కారణంగా ఆ చోట్లలో పెరిగే ఫంగస్‌తో, వాటి స్పోరుల (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) కారణంగా అవి తమ ఆరోగ్యానికి సరిపడనప్పుడు ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’ అనే ఈ సమస్య వస్తుంది. నిత్యం ఎయిర్‌కండిషనర్‌లో ఉండేవారి కొందరికి ఆ చల్లటి వాతావరణం సరిపడకపోవడం వల్ల కూడా రావచ్చు. ఆ తేమ సరిపడదు కాబట్టి దీన్ని ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’గా పేర్కొంటారు.
హాట్ టబ్ లంగ్: కొందరు హాబీగానో, రిలాక్సింగ్ కోసమో లేదా తమ ఆరోగ్యం కోసమో ‘స్పా’ల వంటి చోట్ల ‘తొట్టి స్నానాలు’ వంటివి చేస్తుంటారు. మరికొందరు ఇన్‌హెలేషన్ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటిని పీలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ నీరు నిల్వ ఉండిపోవడం లేదా ఎప్పుడూ నీళ్లతో నిండి ఉండే ఆ పాత్రను సరిగా కడగక΄ోవడం, తొట్టిస్నానం చేసే ఆ తొట్లలో సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడంతో అక్కడ పలు రకాల అలర్జెన్స్ పెరగవచ్చు. ఆ అలర్జెన్స్ సరిపడక వచ్చే ఈ సమస్యను ‘హాట్ టబ్ లంగ్’ అంటారు. మరీ ముఖ్యంగా గాలి సరిగా ప్రసరించని చోట్లలోని కలుషితమైన నీటి మీదుగా వచ్చే గాలినీ, ఆ నీటి తాలూకు ఆవిరులను పీల్చడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది.
లక్షణాలు...
మనకు సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. అవి అప్పటికప్పడు అక్యూట్‌గా కనిపించి బాధించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్‌గా) వస్తూ వేధించవచ్చు. ఆ లక్షణాలేమిటంటే..
ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఊపిరి అందకపోవడం
తీవ్రమైన ఆయాసం, జ్వరం, చలితో వణుకు రావడం
కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి.
కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.
గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... ఊపిరితిత్తుల్లో గాలి చేరే చివరి స్థానమైన గాలిసంచి (ఆల్వియోలై)లో వ్యర్థపదార్థాలు (ఎగ్జుడస్) నిల్వ ఉండిపోయి, అవి అడ్డంకిగా మారడంతో గాలి పీలుస్తున్నా లోపలికి వెళ్లదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. ఇలాంటి కండిషన్‌ను ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.
ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం నీలంగా మారిపోవడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్‌పోజ్ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటలపాటు కనిపించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే కొందరిలో లక్షణాలు తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్ కారణంగా లక్షణాలు ఎడతెరిపిలేకుండా బాధిస్తూ ఉండవచ్చు.
ఊపిరితిత్తులకు జరిగే నష్టమిలా...
ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయమైనట్టుగా గాట్లవంటివి ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్కారింగ్’ అంటారు. అంతే కాదు... ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా జరగడాన్ని ‘పల్మునరీ ఫైబ్రోసిస్’గా చెబుతారు.
ఏ ప్రశ్నలతో క్లినికల్‌గా డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారంటే...
లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లు తొలుత స్టెత్‌తో ఊపిరితిత్తులను పరీక్షిస్తారు. పల్స్ ఆక్సిమీటర్‌తో రక్తంలో ఆక్సిజన్ మోతాదులను, నాడీ స్పందనలను చూస్తారు. సమస్య నిర్ధారణ కోసం సాధారణంగా ఈ ప్రశ్నలు అడిగే అవకాశముంది.
వృత్తిపరంగా ఏవైనా ఘాటైన వాసనలు, దుమ్ముధూళి రేణువులకు ఎక్స్‌పోజ్ అవుతున్నారా?
ఇంట్లో ఎయిర్‌కండిషనర్ చాలా రోజుల్నుంచి శుభ్రం చేయలేదా? ఫిల్టర్లు మార్చి చాలాకాలమైందా?
ఇంట్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే, అక్కడి నిల్వ నీళ్ల వాసన పీల్చారా?
తరచూ తొట్టిస్నానం (టబ్ బాత్) చేస్తారా? ఆ తొట్టి శుభ్రంగా ఉందా?
పరిసరాల్లో పక్షులు ఉంటాయా? ఇంటి చుట్టూ పిట్టలు రెట్టలేస్తుంటాయా?
డాక్టర్లు అడిగే ఈ ప్రశ్నలను తమకు తాముగా వేసుకున్నప్పుడు అవునని మీకే అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి, ఈ అంశాలను వివరించడం బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.
వీళ్లకు మరింత ముప్పు...
ఆస్తమా లేదా తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ వచ్చేవారిలో
సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవాళ్లలో / పొగతాగే అలవాటు ఉన్నవారిలో
గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో , స్పీలనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలో , పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇదివరకే ఊపిరితిత్తుల సమస్యలు, టీబీ ఉన్నవారిలో.
నిర్ధారణ పరీక్షలు...
తొలుత స్టెతస్కోప్‌తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షించడం.
ఛాతీ ఎక్స్–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలతో.
శ్వాస ప్రక్రియ సరిగా ఉందా అని తెలుసుకోడానికీ లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి చేసే ‘లంగ్
ఫంక్షన్ టెస్ట్’. ∙ఏవైనా అలర్జెన్స్‌తో అలర్జీ ఉందేమో తెలుసుకునే యాంటీబాడీస్ రక్తపరీక్ష.
నోటి నుంచి లేదా ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలి వెళ్లే దారులను పరీక్షించే బ్రాంకోస్కోప్ పరీక్ష. (దీంతో వోకల్ కార్డ్స్, విండ్‌పైప్ వంటి చోట్లలో ఏమైనా అసాధారణతలు ఉన్నాయా అని తెలుస్తుంది).
మరీ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి చేసే ‘సర్జికల్ లంగ్ బయాప్సీ’ లేదా... ‘క్రయో లంగ్ బయాప్సీ’ (దీన్ని ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ (టీబీసీబీ) వంటి పరీక్షలు.
చాలాకాలం పాటు మూసి ఉన్న ఇళ్లలోకి వెళ్లినప్పుడు...
చాలాకాలంపాటు మూసి ఉన్న ఇళ్లలోకి ఏ వృత్తిపరమైన కారణం వల్లనో లేదా ఇల్లు మారడం వల్లనో వాసనతో కూడిన ఆ వాతావరణంలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందక΄ోవడం, ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి కాలుష్య పదార్థాలు ఉండటమే అందుకు కారణం. ఇది కొందరిలో తక్షణం సమస్యగా (అక్యూట్‌గా) కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ అనేది ఎంత సాధారణ సమస్య అంటే.. దీని వ్యాప్తి చాలా సాధారణం. మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం.
చికిత్స...
యాంటీ హిస్టమైన్ మందులతోమరీ అవసరమైనవారికి అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్. ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసి, ఊపిరి అందేలా చేసే ‘బ్రాంకోడయలేటర్స్’ జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తున్న వారిలో దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి అవసరమైతే ‘ఇమ్యూనో సప్రెసివ్ మందులు’ రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టాల్సిరావడం. తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగానూ, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి, అవి పీచు (ఫైబ్రస్)గా అయిపోయినవాళ్లకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) మాత్రమే చివరి ఆప్షన్ కావచ్చు.

డా. రమణ ప్రసాద్ సీనియర్ పల్మునాలజిస్ట్,– స్లీప్ స్పెషలిస్ట్


