
ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధుల్లో రొమ్ముక్యాన్సర్ ఒకటి. మనదేశంలో మహిళల్లో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో, అలాగే మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలోనూ దానిదే అగ్రస్థానం. ఈ క్యాన్సర్‌ను ఎంత త్వరగా కనుక్కుంటే మహిళల్లో సమర్థ చికిత్స ద్వారా దాన్నుంచి నూటికి నూరు పాళ్లూ పూర్తిగా విముక్తి పొందే అవకాశముంది. ఈ అక్టోబరు నెల ‘రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం’(Breast Cancer Awareness Month 2025). ఈ నేపథ్యంలో రొమ్ముక్యాన్సర్‌కు కారణాలూ, స్క్రీనింగ్ ప్రాధాన్యం, అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
రొమ్ముక్యాన్సర్ (Breast Cancer) ప్రధానంగా మహిళల రొమ్ముల్లో ఉండే పాలు ఉత్పత్తి చేసే ‘లోబ్యూల్స్’ అనే గ్రంథుల్లో లేదా ఆపాలను నిపుల్ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ట్యూబుల్లో గానీ పెరిగే అవకాశం ఎక్కువ. ఆ హానికరమైన ట్యూమర్ నుంచి క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే లింఫ్ నోడ్స్‌లోకి ప్రవేశించేందుకు అవకాశముంటుంది. ఒకసారి క్యాన్సర్ కణం లింఫ్ నోడ్స్ లోకి గానీ ప్రవేశిస్తే... అక్కడి నుంచి అది దేహంలోని ఏ ్ర΄ాంతానికైనా విస్తరించే ముప్పు ఉంటుంది. అందుకే ఆలోపే దాన్ని కనుక్కోగలిగితే చికిత్సతో రొమ్ముక్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశముంటుంది. అందుకే రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంచుకునే అవకాశం తప్పనిసరి.
రొమ్ముక్యాన్సర్ విస్తృతి
ఇది సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా వచ్చే ప్రధానమైన క్యాన్సర్. మహిళల్లోనే వస్తుందన్నంత మాత్రాన పురుషుల్లో దీని ముప్పు ఉండదని కాదు. అయితే పురుషుల్లో ఇది కాస్తంత అరుదు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం... ప్రతి 135 మంది మహిళలకు ఒక పురుషుడిలో ఇది కనిపిస్తుంది. పైగా గతంలో ΄ోలిస్తే ఇటీవల పురుషుల్లోనూ ఇది కాస్తంత ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా మహిళలకే పరిమితమని చెప్పడానికి వీల్లేదు.
కారణాలూ... ముప్పును పెంచే అంశాలు
ఇదమిత్థంగా ఇవే కారణాలంటూ స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ... రొమ్ముక్యాన్సర్‌ను అనేక అంశాలు తెచ్చిపెడతాయి. వాటిల్లో కొన్ని...
కుటుంబం చరిత్ర : కుటుంబంలో దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉండటం, అందునా తల్లి, తల్లి సోదరి లాంటి మరీ దగ్గరి బంధువుల్లో రొమ్ముక్యాన్సర్ దాఖలా ఉన్నవాళ్లలో దీని ముప్పు మరింత ఎక్కువ.
జన్యుపరమైన ముప్పు : జన్యుపరంగా బీఆర్‌సీఏ 1, బీఆర్‌సీఏ 2 అనే జన్యుపరమైన మ్యుటేషన్ జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ తప్పక వచ్చే అవకాశం.
త్వరగా రుతుస్రావం రావడం : బాలికలు చాలా త్వరగా రుతుస్రావం కావడం (అంటే 12 ఏళ్ల లోపే బాలికలు రుతుస్రావం మొదలుకావడం) అలాగే రుతుక్రమం ఆగడం చాలా ఆలస్యంగా జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ ముప్పు (రిస్క్) ఎక్కువ.
సంతానలేమి / ఆలస్యంగా సంతానం : సంతానం లేని మహిళలూ, అలాగే చాలా ఆలస్యంగా గర్భవతులైన వాళ్లలో.
అస్తవ్యస్తమైన జీవనశైలి / దురలవాట్లు : అంతగా క్రమశిక్షణ లేకుండా అనారోగ్యకరమైన జీవనశైలితో ఉండేవాళ్లకూ, అలాగే పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉన్నవాళ్లలో (ప్రధానంగా విదేశీ మహిళల్లో ఈ తరహా అలవాట్లు ఎక్కువ).
రేడియేషన్‌కు గురైన మహిళల్లో : తాము యువతులుగా ఉన్నప్పుడు ఏవైనా కారణాలతో రేడియేషన్‌కు చాలా ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన మహిళల్లో.
కుటుంబ చరిత్ర, ఇతర అంశాలూ పూర్తి కారణాలు కాదు...
అయితే ఈ సందర్భంగా ఒక ప్రధానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైన పేర్కొన్న అంశాలనే ప్రామాణికంగా తీసుకోవడమూ పూర్తిగా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగిన కేసుల్లో దాదాపు 70శాతం మందిలో వాళ్ల కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న దాఖలాలు లేకపోవడం ఒక వైరుధ్యం. అలాగే నిర్దిష్టంగా ఫలానా అంశమే రొమ్ముక్యాన్సర్‌కు కారణమవుతుందని లేదు. చాలా సందర్భాల్లో ఎలాంటి రిస్క్‌ఫ్యాక్టర్స్ లేనివాళ్లలోనూ ఇది కనిపించడమూ మామూలే.
చివరగా... గత మూడు దశాబ్దాల్లో రొమ్ముక్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దాంతో త్వరగా కనుగొంటే రొమ్ముక్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అయితే రొమ్ముక్యాన్సర్ చికిత్స వరకూ వెళ్లకుండానే తమ సొంత దేహంపై పూర్తి అవగాహనతోనూ, ఆరోగ్యకరమైన జీవనశైలిలోనూ దాన్ని నివారించుకోవడం చాలా మేలు అనేది వైద్య నిపుణుల సూచన.
అపోహలూ ఎక్కువే
రొమ్ముక్యాన్సర్ విషయంలో అపోహలూ ఎక్కువే. ఉదాహరణకు రొమ్ముల్లో గడ్డలు, నీటితిత్తులు ఉన్నప్పుడు అది క్యాన్సరే అని చాలామంది అ΄ోహ పడుతుంటారు. రొమ్ముల్లో గడ్డలూ, నీటితిత్తులూ కనిపించడం చాలా సాధారణం. ఇలాంటివారిలో 80 శాతం కేసుల్లో అది హానికరం కానివే. వాటినే ‘బినైన్’ గడ్డలుగా చెబుతారు. కేవలం 20 శాతం కేసుల్లోనే అవి హానికరమైన (మేలిగ్నెంట్) క్యాన్సర్‌గా బయటపడతాయి. అందుకే రొమ్ముల్లో గడ్డలు కనిపించగానే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కనిపించేవాటిల్లో చాలావరకు అంటే దాదాపు 80 శాతం ఎలాంటి హానీ కలిగించనివే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రొమ్ముల్లో అలాంటి గడ్డలు కనిపించగానే వీలైనంత త్వరగా ఒకసారి డాక్టర్‌కు చూపించి, అవి హానికరం కాదని వారు నిశ్చయంగా చె΄్పాక ఇక నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే పెద్దసైజు రొమ్ములు ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువ అనేది మరో అపోహ. రొమ్ము పెద్దగా ఉండటానికీ, క్యాన్సర్‌కూ ఎలాంటి సంబంధమూ ఉండదు.
చదవండి: స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్
స్క్రీనింగ్ పరీక్షలు అన్నిటికంటే ప్రధానం...
రొమ్ము క్యాన్సర్‌ను ఎంత త్వరగా కనుక్కుంటే దాన్నుంచి అంత పూర్తిగా విముక్తం కావడం సాధ్యమనే విషయాన్ని బట్టి బ్రెస్ట్‌క్యాన్సర్ విషయంలో స్క్రీనింగ్ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యమేమిటన్నది వివరించవచ్చు. దాదాపు 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా, అలాగే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న మహిళలతో పాటు రిస్క్‌ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు ఏడాదికోమారు లేదా తమ డాక్టర్ చెప్పిన విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రతి మహిళా తమ రొమ్ములను పరీక్షించుకునే ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ వివరాలు తెలుసుకుంటూ స్నానం సమయంలో వాటిని పరీక్షించుకుంటూ ఉండాలి. అందువల్ల తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్‌ను కనుక్కోవడం సాధ్యం... తద్వారా దాన్నుంచి పూర్తిగా విముక్తం కావడమూ సాధ్యమే.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు...
ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవేమిటంటే...
రొమ్ము లేదా చంకల్లో నొప్పిలేని గడ్డ (లంప్) కనిపించడం.
రొమ్ము సైజు లేదా ఆకృతిలో మార్పు రావడం.
నిపుల్ నుంచి ఏదైనా ద్రవం స్రవిస్తుండటం.
రొమ్ము చర్మంపై ఏవైనా మార్పులు అంటే గుంటపడటం లేదా చర్మం మందంగా మారడం వంటివి.
చాలా అరుదుగా రొమ్ముక్యాన్సర్ వచ్చినవాళ్లలో రొమ్ములో లంప్, ఒకవేళ లంప్ లేకుండానే రొమ్ముపై చర్మం పొరలు పొరలుగా ఊడుతూ ఉండటం, రొమ్ము ఎర్రబారడం, వాపు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపించవచ్చు.
నివారణ/చికిత్స...
క్యాన్సర్‌కు కారణమయ్యే కొన్ని అంశాల్లో మానవ నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు పెరుగుతుండే వయసు. అయితే మన ప్రమేయంతో రొమ్ముక్యాన్సర్‌ను చాలావరకు నివారించవచ్చు. ఉదాహరణకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారాన్ని తీసుకోవడం; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం; ప్రసవం తర్వాత పిల్లలకు చనుబాలు పట్టించడం; ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్‌ను చాలావరకు నివారించవచ్చు. అయితే ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్సలతోపాటు అనేక ఇతరత్రా ప్రక్రియలతో రొమ్ముక్యాన్సర్‌కు సమర్థమైన చికిత్స సాధ్యం.
నిర్వహణ: యాసీన్