
ప్రకటించిన యూకే ప్రధానమంత్రి కార్యాలయం
500 ఏళ్లలోనే మొదటి మహిళా ఆర్చ్‌బిషప్‌గా రికార్డు
165 దేశాల్లో 8.50 కోట్ల మంది ఆంగ్లికన్‌లు
లండన్: చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మహిళా ఆర్చ్‌బిషప్ నియమితులయ్యారు. ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా డేమ్ సారా ములాలీ(63)ని కింగ్ ఛార్లెస్–3 నియమించారని శుక్రవారం యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో, చర్చ్ 500 ఏళ్ల చర్రితలో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళా మతపెద్దగా ములాలీ చరిత్ర సృష్టించినట్లయింది.
ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో ఉన్న 8.5 కోట్ల మంది ఆంగ్లికన్‌లకు ములాలీ ఆధ్యాత్మిక నాయకత్వం వహించనున్నారు. జాతీయ ఆరోగ్య సేవల(ఎన్‌హెచ్‌ఎస్) విభాగంలో చీఫ్ నర్స్‌గా పనిచేసిన సారా ములాలీ 2006లో బోధకురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మొట్టమొదటి మహిళా బిషప్ ఆఫ్ లండన్‌గా, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో అత్యంత మూడో సీనియర్ మతపెద్దగా ఎదిగారు. గతేడాది నవంబర్ 12వ తేదీన రెవరెండ్ జస్టిన్ వెల్బీ రాజీనామా చేశారు.
చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌తో సంబంధమున్న ఓ న్యాయ వాది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసీ సంబంధిత అధికారులకు సమాచారమివ్వలేదని విమర్శలు రావడంతో ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. అప్పట్నుంచీ ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీ పదవి ఖాళీగా ఉంది. 106వ ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా మొట్టమొదటి మహిళగా సారా ములాలీ నియమితులవడాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.
అయితే, 2026 జనవరిలో లండన్‌లోని సెయింట్ పౌల్స్ కేథడ్రల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా ప్రకటించే వరకు ఆమెను ఆర్చ్‌బిషఫ్ ఆఫ్ కాంటర్‌బరీ–డిజిగ్నేట్‌గా వ్యవహరిస్తారు. అనంతరం మార్చిలో కాంటర్‌బరీ కేథడ్రల్‌లో జరిగే కార్యక్రమంలో అధికారికంగా ఆమెను ఆసీనురాలిని చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లికన్ కమ్యూనియన్ అంతటా లక్షలాది మంది ప్రజలతో విశ్వాస ప్రయా ణాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు సారా ములాలీ తెలిపారు.
‘ఇది చాలా పెద్ద బాధ్యత అని నాకు తెలుసు. కానీ, దేవుడు ఎప్పటిలాగే నా బాధ్యతను తీసుకుంటాడనే నమ్మకంతోనే కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడుతున్నాను’అని ఆమె వినమ్రంగా చెప్పారు. అంతకుముందు, నర్స్‌గా పనిచేసిన ములాలీ 2001లో కేవలం 37 ఏళ్లకే యూకే ప్రభుత్వ చీఫ్ నర్సింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టి, చరిత్ర సృష్టించారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్, గ్లోబల్ ఆంగ్లికన్ కమ్యూనియన్, కాంటర్‌బరీ డయోసెస్‌ల ప్రతినిధులతో కూడిన కాంటర్‌బరీ కోసం క్రౌన్ నామినేషన్స్ కమిషన్ (సీఎన్‌సీ) సారా ములాలీని ఈ పదవికి ఎంపిక చేసింది.