ఆహ్వానించి అపహరణ! | Funday Crime Story | Sakshi
Sakshi News home page

ఆహ్వానించి అపహరణ!

Oct 5 2025 2:05 AM | Updated on Oct 5 2025 2:05 AM

Funday Crime Story

వీరారెడ్డి పేరుతో ఇల్లు, ఇల్లాలు, వాహనం, జైల్లో పరిచయమైన అనుచరులను సిద్ధం చేసుకున్న గౌరు సురేష్‌– ఆ తర్వాత ఎవరిని కిడ్నాప్‌ చేసి డబ్బు గుంజాలనేది ఆలోచించాడు. ఏమాత్రం ఇబ్బంది, హడావుడి లేకుండా పని జరగాలంటే, హైదరాబాద్‌కు చెందిన వారు కాకపోతేనే ఉత్తమమని భావించాడు. తన ‘భార్య’తో తిరుమలకు వెళ్లిన గౌరు సురేష్‌ అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుపతికి చెందిన వ్యాపారి గంగయ్యను టార్గెట్‌గా చేసుకున్నాడు. హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తర్వాత ఓ డ్రైఫ్రూట్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి దానికి అతడే వైస్‌ ప్రెసిడెంట్‌గా మారి, విజిటింగ్‌ కార్డులు సిద్ధం చేసుకున్నాడు. 

మరోసారి తిరుపతి వెళ్లిన సురేష్‌– గంగయ్యను కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. త్వరలో హైదరాబాద్‌లో డ్రైఫ్రూట్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నానని, తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానపత్రం అందించాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని గంగయ్య దీనిని మరచిపోయాడు. కిడ్నాప్‌ పథకాన్ని అమలులో పెట్టడానికి సురేష్‌–  గంగయ్య పేరుతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానం టిక్కెట్, తాజ్‌ కృష్ణలో ఓ గదిని బుక్‌ చేశాడు. ఎగ్జిబిషన్‌ పేరుతో ఆహ్వానపత్రిక ముద్రించి, ఇవన్నీ కొరియర్‌ ద్వారా గంగయ్యకు పంపాడు. గంగయ్యకు సురేష్‌ ఫోన్‌ చేసి, తప్పకుండా రావాలని, ఎయిర్‌పోర్టుకు కారు పంపిస్తానని చెప్పాడు. 

దీంతో గంగయ్య తాను హైదరాబాద్‌ వచ్చేటప్పుడు వీరారెడ్డి అవతారంలో ఉన్న సురేష్‌కు చెప్పాడు. గంగయ్య వచ్చేరోజు వెంకటరెడ్డి వద్దకు వెళ్లిన సురేష్, భార్యతో కలసి బయటకు వెళ్లడానికంటూ కారు తీసుకున్నాడు. ఆ కారులో విమానాశ్రయానికి వెళ్లి, గంగయ్యను రిసీవ్‌ చేసుకున్నాడు. ఎగ్జిబిషన్‌ పనుల్లో తలమునకలై ఉన్నానని, ఉప్పల్‌లో చిన్న పని చూసుకుని వెళ్దామని సురేష్‌ నమ్మబలికాడు. అలా అతడిని వారాసిగూడలోని మల్లారెడ్డి ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న గ్యాంగ్‌కు గంగయ్యను అప్పగించి, తాను చెప్పే వరకు జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన ఫ్లాట్‌కు వెళ్లిపోతూ వెంకట్‌రెడ్డికి కారు అప్పగించేశాడు. 

గంగయ్య నుంచి అతడి సోదరుడి ఫోన్‌ నెంబర్‌ తీసుకున్న సురేష్, ‘మీ అన్నను కిడ్నాప్‌ చేశామని, విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు ఇవ్వాల’ని డిమాండ్‌ చేశాడు. విషయం ఏమాత్రం బయటకు వచ్చినా హైదరాబాద్‌ శివార్లలో గంగయ్య శవం పడి ఉంటుందని భయపెట్టాడు.ఈ ఫోన్‌ కాల్‌తో భయపడిన గంగయ్య సోదరుడు విషయం పోలీసులకు చెప్పకుండా, డబ్బు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. డబ్బు సిద్ధం చేసుకోవడానికి అతడు రెండుమూడు రోజుల పాటు పలువురిని సంప్రదించాడు. ఇలా విషయం బయటకు రావడంతో చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి, గంగయ్య సోదరుడి నుంచి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే తన సోదరుడికి హాని జరుగుతుందనే భయంతో విషయం పోలీసులకు చెప్పడానికి గంగయ్య సోదరుడు వెనుకాడాడు. దీంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా వేసి ఉంచారు.

తన అన్నను విడిపించుకోవడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసిన గంగయ్య సోదరుడు ఫోన్‌ చేసి సురేష్‌కు విషయం చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా ఒక్కడివే బయలుదేరి రావాలని, భారత్‌ ట్రావెల్స్‌ బస్సులో సీట్‌ నెం.17 బుక్‌ చేసుకోవాలని, జడ్చర్ల వద్ద బస్సు దిగిపోవాలని సూచనలు ఇచ్చాడు. ఏమాత్రం తేడా వచ్చినా గంగయ్య ప్రాణాలతో ఉండడని బెదిరించాడు. గంగయ్య సోదరుడు అదే బస్సులో అదే సీటు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాడు. విషయం తెలిసిన చిత్తూరు పోలీసులు– అదే బస్సులో వెళ్లి, కిడ్నాపర్లను పట్టుకోవడానికి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు టికెట్లు బుక్‌ చేశారు. గంగయ్య సోదరుడు, ఈ ముగ్గురు పోలీసులు ఒకే బస్సులో బయలుదేరారు. తనను అనుసరిస్తూ పోలీసులు వస్తున్న విషయం గంగయ్య సోదరుడికి తెలీదు. అదే రోజు రాత్రి మరోసారి వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లే సురేష్‌ మళ్లీ భార్యతో ట్రిప్‌ అంటూ ఇండికా కారు తీసుకున్నాడు. 

గంగయ్య సోదరుడు ప్రయాణిస్తున్న భారత్‌ ట్రావెల్స్‌ బస్సు జడ్చర్లకు చేరుకునే సమయానికి సురేష్‌ కారుతో సçహా అక్కడ సిద్ధంగా ఉన్నాడు. బస్సు అక్కడకు చేరుకున్నాక గంగయ్య సోదరుడు బ్యాగ్‌ పట్టుకుని దిగడంతో, అది గమనించిన ఎస్సై కూడా అతడితో పాటు కిందికి దిగారు. అతడిని చూడగానే పోలీసు అని గుర్తించిన సురేష్, దృష్టి మళ్లించడానికి క్షణాల్లో మరో పథకం వేశాడు. ఆ పోలీసుని ఉద్దేశించి ‘మీరూ హైదరాబాద్‌ వెళ్లాలా..? లగేజీ తెచ్చుకోండి’ అని చెప్పాడు. ఎదుటి వారికి తనపై అనుమానం రాకూడదని భావించిన సదరు ఎస్సై తన బ్యాగ్‌ తీసుకువచ్చి కారు ఎక్కాలని భావించారు. బ్యాగ్‌ కోసం బస్సు ఎక్కగా, అప్పటికే కింద ఉన్న గంగయ్య సోదరుడిని కారులో ఎక్కించుకున్న సురేష్‌ రాంగ్‌ రూట్‌లో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగుతిన్న చిత్తూరు పోలీసులు విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పారు. 

చిత్తూరు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ వెంటనే రంగంలోకి దిగింది. అయితే అప్పటికే గంగయ్య సోదరుడి నుంచి డబ్బు తీసుకుని, అతడిని శంషాబాద్‌ వద్ద వదిలేసిన సురేష్‌ నేరుగా వనస్థలిపురం వెళ్లిపోయాడు. కారు వెంకట్‌రెడ్డికి అప్పగించిన తర్వాత ‘తన భార్య’కు పేమెంట్‌ సెటిల్‌ చేసి పంపించేశాడు. డీసీఎం వ్యాన్‌లో ఫ్లాట్‌లోని సామాను మొత్తం సర్దుకుని, మల్లారెడ్డిని సంప్రదించి, ‘ప్యాకేజ్‌’ని వదిలేసి నాంపల్లికి రావాలని చెప్పాడు. గంగయ్యను తీసుకుని బయలుదేరే మల్లారెడ్డి గ్యాంగ్‌ అతడిని ఎంజీబీఎస్‌ వద్ద వదిలేసి, ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చింది. వీళ్లు నాంపల్లికి చేరుకునేసరికి సురేష్‌ డీసీఎంలోని ఇంటి సామాను మొత్తం సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో అమ్మేసి, సిద్ధంగా ఉన్నాడు. 

మల్లారెడ్డి గ్యాంగ్‌కు కొంత మొత్తం ముట్టజెప్పి, అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గంగయ్య, అతడి సోదరుడు బతుకు జీవుడా అనుకుంటూ తిరుపతి చేరుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మల్లారెడ్డితో పాటు మిగిలిన గ్యాంగ్‌ను పట్టుకుని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. అయితే సురేష్‌ మాత్రం చిక్కలేదు. తన నేర పరంపరను కొనసాగిస్తూ 2006 సెప్టెంబర్‌ 13న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త జి.కృష్ణంరాజును ఆయన పెంపుడు శునకంతో సహా కిడ్నాప్‌ చేశాడు. ఈ కేసులో అరెస్టు అయినప్పుడే, గంగయ్య కిడ్నాప్‌ స్కెచ్‌ బయటకు వచ్చింది. ఇలాంటి అనేక నేరాలు చేసిన గౌరు సురేష్‌ 2008 జూలై 18న బేగంపేటలోకి ఎయిర్‌ కార్గో కాంప్లెక్స్‌ వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. 
(సమాప్తం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement