నేటి నుంచి రెండు రోజులపాటు పారిశ్రామిక వాడలను సందర్శించనున్న గులాబీ నేతలు
8 నిజ నిర్ధారణ బృందాల ఏర్పాటు...నేడు జీడిమెట్లకు కేటీఆర్
బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ టెలికాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. ‘హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’(హిల్ట్–పి) పేరిట జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు క్షేత్ర స్థాయికి వెళ్లనుంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. ‘హిల్ట్ పి’ఉత్తర్వుల్లో పేర్కొన్న 22 పారిశ్రామిక వాడలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించారు.
ఈ క్లస్టర్లలో బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ బృందాలు ఈ నెల 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తాయి. కేటీఆర్ నేతృత్వంలోని బృందం బుధవారం జీడిమెట్ల పారిశ్రామికవాడను సందర్శిస్తుంది. ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్న వారితో కేటీఆర్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ధరల వ్యత్యాసం జనం ముందుకు...
పారిశ్రామిక భూముల బదలాయింపులో జరుగుతున్న అవకతవకలతోపాటు, హిల్ట్ పాలసీ వెనుక దాగిన రూ.5 లక్షల కోట్ల కుంభకోణంలోని నిజానిజాలను ప్రజల ముందు పెట్టాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘స్థానిక నాయకులు, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలి. ప్రభుత్వం భూ బదలాయింపు చేయాలనుకుంటున్న పారిశ్రామిక వాడల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను చర్చించాలి.
అత్యంత చౌకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం వెనుక ఉద్దేశాలను ఈ బృందాలు ప్రస్తావించాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్‌ఆర్‌ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తద్వారా సుమారు రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు.
నిజ నిర్ధారణ బృందాలు ఇవే...
పాశమైలారం, పటాన్‌చెరు, రామచంద్రాపురం-- టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్
నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి-- జి.జగదీశ్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీదేవి
మౌలాలి, కుషాయిగూడ-- ఎస్.మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి
జీడిమెట్ల, కూకట్‌పల్లి-- కేటీఆర్, సత్యవతిరాథోడ్ , పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద
సనత్‌నగర్, బాలానగర్-- తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నవీన్‌రావు
మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కు-- చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు
కాటేదాన్, హయత్‌నగర్ -- సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి
చందూలాల్ బరాదరి-- మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీమ్


