నుదుటి మీద అరచేయి అడ్డుపెట్టి, కళ్ళు విప్పార్చి, ఆకాశంలో ఎగిరే గెద్ద వేపు చూసే పిల్లల కోడిలా దూరంగా కన్పించే వ్యక్తులను ఆందోళనగా చూడసాగేడు మజ్జి సూరపు నాయుడు...వారం రోజులుగా యేదో వేళ, యెవరెవరో వస్తున్నారు. పొలాలను పరిశీలిస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరితోనూ ఏమీ మాటాడడం లేదు. ‘వాళ్ళెవరు?’ ప్రశ్నార్థకంగా చూస్తున్న సూరపు నాయుడి చొక్కా జేబులోని సెల్ మోగింది. నుదుటి మీది అరచేయి తీసి, చొక్కా జేబులోని సెల్ తీసి పట్టుకొని... ‘‘అలో...ఎవుళూ’’ అని ప్రశ్నించాడు. అవతలి వ్యక్తి తాను ఎవరో చెప్పాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు సూరపు నాయుడు. అవతలి వ్యక్తి యేమేమో చెప్తున్నాడు. నాయుడు అన్యమనస్కంగా వింటూ, దూరంగా కన్పించే వ్యక్తుల కదలికలు గమనిస్తున్నాడు.‘‘ఇంటన్నవా నా మాటలు? ఉలకవూ పలకవు. ఏటి చేస్తన్నావ్ బావా?’’ అని ప్రశ్నించాడు అవతలి వ్యక్తి.‘‘వోయ్... వోరమ్ రోజుల నించి పొలాలంట ఎవులెవులో తిరగతన్నారోయ్.
ఏటో అనుమానంగా వుందోయ్. పొలాలకి గాలి వొచ్చీటట్టుగా వుందోయ్’’ – అని భయాన్ని వ్యక్తం చేశాడు నాయుడు.‘‘ఏనుగులో, ఎలుగుబంట్లో, జెంతువులేవో పొలాలంట తిరిగితే బయపడాల గాని మనుషులు తిరిగితే బయపడతావేటి బావా?’’ ‘‘జెంతువులయితే పంటల్ని తిని ఎలిపోతాయి, మనుషులు గాని అలికిడి అయితే పారిపోతాయి’’... అని బదులు చెప్తున్నాడు నాయుడు.‘‘అయితేటి ఆలెవులో పొలాల్ని వొట్టుకుపోతారా?’’‘‘వొట్టుకుపోరు, తీసీసుకుంటారు.’’‘‘ఇచ్చీ బావా, మంచి ధర గాని ఇస్తే ఇచ్చీబావా. ఏల ఏటా అప్పుల్ని పండిస్తావు? పిల్లల బతుకులు పాడు చేస్తావు. ఇచ్చీ, ఆ డబ్బు వొట్టుకొని ఇక్కడికి వొచ్చీ.’’సూరపు నాయుడిని వొచ్చేయమని పిలిచిన అవతలి వ్యక్తి సూరపు నాయుడి మేనమామ కొడుకు, పసరాపల్లి వూరివాడు.
మేనమామకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఫోనులో మాటాడే అవతలి వ్యక్తి మేనమామ చిన్నకొడుకు, సూరపు నాయుడి కంటే నాలుగేళ్ళు పెద్ద. మేనమామ చనిపోయాక అతని ఇద్దరు కొడుకులు ఆస్తి వాటాలు వేసుకుని, వేరు కాపురాలు అయిపోయారు. పసరాపల్లి ప్రాంతాన థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదన రావడం, ఆ ప్రాంత భూములను సేకరించడానికి ప్రభుత్వం పూనుకోవడం, రైతులు ప్రతిఘటించడం, పోలీసు కాల్పుల్లో తన అన్న చనిపోవడం, కేసులు, కోర్టులతో విసిగి, రెండు కుటుంబాలతో హైదరాబాద్ వలస వచ్చేశాడాయన. రెండు కుటుంబాలు కూలీ, నాలీ చేసుకు బతుకుతున్నాయి. తిప్పలెన్ని పడినా, తిండికీ, గుడ్డకీ లోటు లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అందుకే ఆయన సూరపునాయుడ్ని వొచ్చేయమన్నాడు.
సూరపు నాయుడు ఆ వ్యక్తితో మాటాడుతూనే పొలం నుంచి వూరి గోర్జీ తోవలోకి నడిచాడు. నడుస్తున్న వాడు ఆగి – ‘‘ఏటివోయ్? పొలం అమ్మీసి, పట్నమొచ్చి ఆ డబ్బులు తిని కూకోమంటావా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తిని కూకోడం ఏల బావా? పట్నంల వొవ్వో... బోల్డు పనులు... అపార్ట్‌మెంట్లల్ల వాచ్‌మెన్, పెద్ద పెద్దోల్ల బంగ్లాల గేటు కాపలా, యేదో చిన్నా చితకా ఫేక్టరీలల్ల లేబర్ ... ఇలాటివి దొరకవా?’’ అనన్నాడు. ‘‘దొరకవా అని నన్నడుగుతావు? నాకేటి తెలుసు?’’ ప్రశ్నించాడు సూరపు నాయుడు.అవతలి వ్యక్తి, ఆ ప్రశ్నను పట్టించుకోకుండా – ‘‘కాదంటావా... తాపీ పనికో, కళాసీ పనికో యెళ్తే డయిలీ ఇన్కమ్ బావా’’ – అని ఇంగ్లీషులో చెప్పాడు సూరపు నాయుడులో ఆశలు రగిలించడానికి.‘‘వోయ్... రైతోడు చేపలాంటోడువోయ్. పొలమొదిలేస్తే వొడ్డున పడ్డ చేప అయిపోతాడు’’... అన్నాడు నాయుడు.
‘‘వోస్... నీను మరి రైతుని కానేటి? భూమి పోయినపుడు వొచ్చీలేదేటి? వొచ్చిన తొలినాళ్ళు కసింత బెంగగా వుంటాది. ఏదో పని దొరికిన తరాత అలవాటయి పోతాది – వొచ్చీవోయ్. ఒచ్చీ. భూమి ఇచ్చీవోయ్ ఇచ్చీ, పరిహారం అందుకో. అందల కొంత సొమ్ముతో, కూతురుకి పెళ్లిచేసి, అత్తోరింటికి తోలీ. మిగిలిన సొమ్ము తీసుకొని, కొడుకుని తీసుకొని వొచ్చీ. ఆడికి ఆటో ఒకటి కొనీసి ఇచ్చీ. ఇక్కడ ఆటోకి మంచి గిరాకీ. ఇంకోపక్క నువ్వు ఏదో పనికి కుదిరి పోనావనుకో, ఇంక మరి సూడక్కర్లేదు మీకు’’... అని భవిష్యత్ ఆశాజనకంగా చెప్పాడు అవతలి వ్యక్తి. రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఆశాజనకంగా చెప్తున్నారు. కంపెనీలు వొస్తే, ఉజ్జోగాలొస్తాయి. హోటళ్ళు, లాడ్జింగులు, బిల్డింగ్లు, రోడ్లుతో ప్రాంతం రూపురేఖలే మారిపోతాయ్ అంటన్నారు.
సూరపు నాయుడికే ఏమీ తోచడం లేదు. నిలబడినవాడు, నడుస్తూ – ‘‘నాకు రైత్వారీ పని తప్ప, ఇంకొక పని రాదుగదా’’... అన్నాడు దిగాలుగా. ∙∙∙కొద్ది రోజులకు సూరపునాయుడు భయపడ్డట్టుగానే పొలాలను పరిశీలించిన వారు పొలాలను ఏదో కర్మాగారం కోసం తీసుకున్నారు. రైతులు కొన్నాళ్లు వ్యతిరేకించారు. పోరాడేరు గాని, కొసకు భూములు ఇవ్వక తప్పలేదు. మేనమామ చిన్న కొడుకు చెప్పినట్టే సూరపు నాయుడు ఆడపిల్ల పెళ్లి చేసి, తరవాత కొడుకుని పట్టుకొని హైదారాబాద్ వెళిపోయాడు. మిగిలిన సొమ్ము ఆటో కొనడానికి చాలలేదు, కొంత ఫైనా¯Œ ్స వాడేడు. కొడుకు ఆటో తిప్పుతూ ఫైనా ్స నక్షత్రకుడికి కిస్తీలు కడుతున్నాడు. సూరపు నాయుడు రకరకాల కూలిపనులు చేస్తూ చివరికి ఒక కోటీశ్వరుని ఇంటనున్న రెండు కుక్కల ఆలనా పాలనా చూడడానికి కుదురుకున్నాడు.
పొద్దున్న ఏడో గంటకి ఆ కోటీశ్వరుని ఇంటికి చేరితే, రెండు కుక్కలూ రెడీగా ఉంటాయి షికారుకి. షికారుకి వెళ్ళినపుడే అవి ఒంటికీ, రెంటికీ కానిస్తాయి. సూరపు నాయుడే వాటిని శుభ్రం చేయాలి. రెండూ నాయుడి భుజాల దగ్గరకు ఉంటాయి. నాయుడి కంటే బలంగా ఉంటాయి. ఉండవా మరి? అవి తినేవో? మన్లాగా అంబలీ, గెంజీ తాగుతాయేటి? అనుకున్నాడు నాయుడు. తొలినాళ్ళల్లో నాయుడు వాటిని తిప్పడానికి నానా అవస్థలు పడ్డాడు. వాట్ని చూసి భయపడ్డాడు. ‘బేపుల్లాగా లేవివి, బెమ్మ రాచ్చసుల్లాగ వున్నాయి’ అనుకునీవోడు. రాన్రాను మచ్చికయినాయి. కోటీశ్వరుని ఇంటిలో విని నేర్చుకున్న ఇంగ్లీషు పదాలతో... ‘కమాన్, గో,గో, వెయిట్, వెయిట్’ వంటి ఆర్డర్లు వేస్తున్నాడు.
షికారుకి కుక్కల్ని తీసుకు వెళ్ళే సమయంలో ఆపుడపుడూ వాటితో ఊసులాడుతుంటాడు. అవి కూడా సూరపు నాయుడి ‘ఊరు ఎలా ఉంటుంది? నగరంలా బాగుంటుందా? అన్నీ పూరిపాకలేనా,పెద్ద,పెద్ద భవంతులుంటాయా? అక్కడ మాలాంటి డాగ్స్ ఉంటాయా?’ అని ప్రశ్నించేవి. సూరపు నాయుడికి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే పల్లెకూ, నగరానికీ మధ్య అంతరం తెలిసొచ్చేది. దాంతో విచారంగా మౌనంగా నడిచేవాడు. మౌనంగా నడిచే నాయుడిని – ‘మీ ఊరిలో మాలాటి డాగ్స్ లేవుకదా’, ఉండబోవన్న ధీమాగా ప్రశ్నించేవి ఆ కుక్కలు.అప్పుడు... ‘మా ఊరిలో మిమ్మల్ని డాగ్స్ అనరు. బేపులు అంటారు’... అని చెప్పి, తమ ఊరి బేపులెలాగుంటాయో, ఎంత మంచివో, ఇళ్లనీ, ఊరినీ ఎలాగ కాపలా కాస్తాయో చెప్పేవాడు.
వాటిని మనుషులు ఎవులో తిప్పక్కర లేదనీ, అవే తిరగతాయనీ, తిండీ ఒకలెవులో తెచ్చి పెట్టక్కర లేదనీ, అవే సంపాయిస్తాయనీ... చెప్పేవాడు. అపుడు ఆ కుక్కలు నిసాకారంగా సూరపు నాయుడి వేపు చూసి – ‘మీ వూరి వాళ్ళు వాటికి తిండీ, తిప్పలు చూడరా? ఏం మనుషులోయ్’ అననేవి. ‘మా వూళ్ళంట బేపులకి మెడలకి బెల్టులు, గొలుసులూ కట్టరు. ఫ్రీగా వొదిలేస్తారు. ఆటి ఇష్టం ఇళ్ళల్లోకి దూరతాయి, వీధుల్లో తిరగతాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎళ్తాయి, కట్టడి వుండదాటికి. సిత్త కార్తే వొచ్చిందంటే ... సూడాల ఆటి బాగోతం’ అననేవాడు. ఆ కుక్కలకు ఆ బాగోతం ఏమిటో తెలీలేదు గానీ, ఈ నాయుడోడు వాడి వూరి బేపులు తమ కంటే గొప్పవి సుమా అని తమకు చెప్తున్నాడని భావించి, చిరాకెత్తి, కోపగించి, భౌభౌభౌ అని అరచి తమ నిరసన తెలియ జేసేవి.
∙∙∙
కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. ఒంటరితనం పోగొట్టుకోడానికి అపుడపుడూ తన మేనమామ చిన్నకొడుకుని కలుస్తుంటాడు. ఇద్దరూ కాసేపు తమ గత జీవనాన్ని, తమ తాత, ముత్తాతల తరతరాల జీవనాన్ని ఎరిగిన మేరకు కలబోసుకుంటారు. తామే కాక తమ ప్రాంత జనులంతా శాపగ్రస్తులనీ, ఒడ్డు కనిపించని ప్రవాహంలో ఈదులాడే వాళ్ళనీ... తమ ప్రాంతం చిరకాల శోకగర్భ ప్రాంతమని చింతిస్తారు.కడుపులు కెరలిపోతాయి. ఊరట కోసం సారా కొట్టు చేరుతారు. అపుడపుడూ వీరికి తోడు వీరిలాగే వలస వచ్చిన వాళ్ళు ఎవరో తోడవుతారు. వాళ్లూ లోపలి శోకాన్ని వెళ్లగక్కుతారు...
అవెంతో గొప్ప అడివిలున్నాయి. సాగరతీరమా ఎక్కవే వుంది, సారవంత బూములున్నాయి... ఎందుకు మనం ఇలగ వొలసలు రావలసొచ్చింది? ఎందుకు? అక్కరకు రాని కంపెనీల బదులు నదులకి ఆనకట్టలు, పంటలకి కిట్టుబాటు ధరలందితే, జనప, చెరకు వంటి పంటల మీద మిల్లులెడితే మనకీ దుర్గతి రాదుగదా – అని విలపిస్తారు.మద్యపాన దుకాణాల్లో కడుపుల్లోకి మద్యం వెళ్తుంది, గానీ, లోపలి దుఖం బయటకు వెళ్ళదు. మత్తు ఎక్కినా, నొప్పి ఏదో మోస్తూ, తూలుతూ ఇళ్ళు చేరుతారు.
అయిదేళ్లు గడిచిపోయాయి. ఎన్నికల ప్రకటన వచ్చింది. తమలాగా నగరానికి వలస వచ్చిన వారికోసం పోటీ చేసిన ప్రధాన పార్టీల వారు బస్సులు వేశారు. వోట్ల కోసం సరఫరా చేయాల్సినవన్నీ చేశారు. ఆ బస్సుల్లో సూరపు నాయుడి కుటుంబమే కాక, ఆ ప్రాంతపు కుటుంబాలు మరికొన్ని ప్రయాణించాయి. ఆ కుటుంబాలు చీపురుపల్లి, రణస్థలం, భోగాపురం తదితర ప్రాంతాల నుండి వలస వచ్చినవి. ప్రయాణం మధ్యలో భోజనాలకు ఆగినపుడు మరికొన్ని బస్సుల్లో మరికొన్ని కుటుంబాలు కలిశాయి. అవి అటు పార్వతీపురం పరిసరాల నుండి ఇటు అనకాపల్లి, చోడవరం, అరకు ప్రాంతాల నుండి వచ్చినవి. కళింగం అంతా దాదాపు వలసలు పోయిందా ఏటి అన్పించింది సూరపు నాయుడికి. ఓటు వేశాక వెంటనే బయల్దేరలేదు. రెండు రోజులు వుండిపోయాడు. ఫ్రీ బస్సులు వెలిపోయాయి. స్వంత వూరిలో ఒకరోజు వున్నారు..
స్వంత వూరు రూపు రేఖలు మారిపోయాయి, ఊరినిండా ఏవేవో బిల్డింగులు, దుకాణాలు, ఆఫీసులు... ఒంటినిండా పచ్చబొట్లు పొడుచుకున్న అమ్మవారిలా వుంది ఊరు. పరాయి ఊరులా అన్పించీ, మరసటి రోజే కూతురి వూరు వెళిపోయారు.కూతురి ఊరు ఉద్దాన ప్రాంతం. అరటి, కొబ్బరి, పనస, జీడి తోటలతో ఆకుపచ్చగా ఉంటుంది. కూతురి అత్తవారికి ఒక ఎకరా తోట వుంది. అత్త, మామలు ఉన్నారు. రెండు గదుల ఇల్లుంది. అల్లుడు కష్టజీవి. తోట మీద ఫలసాయంతో ఇబ్బందులు లేకుండా బతుకుతున్నారు. కూతురికి మూడేళ్ళ కొడుకు. ఇపుడు గర్భిణీ. పలాసలో ఏవో స్వీట్స్, పళ్ళు కొని తీసుకు వెళ్లారు.
రాత్రివేళ భోజనాలయ్యాక కూతురి కాపురం బాగుందని సంతోషించిన సూరపు నాయుడు – ‘‘ఎంతయినా మీ ఉద్దానం మా మడక కంటే శ్రేష్టమైనిది’’ అనన్నాడు. ‘‘నిజిమే గాని, ఇక్కడి బతుకులూ గాలిలో దీపాలే మామా, చేతులు అడ్డుబెట్టి దీపాలు ఆరకుండా సూస్తన్నాం’’ అని బదులిచ్చాడు అల్లుడు. కలుక్కుమన్నాది సూరపునాయుడి గుండె. ‘‘తుఫానులు, మార్కెట్లూ దెబ్బగొడతన్నా కాసుకుంటన్నాంలే’’ అనన్నాడు అల్లుడు. ఆ మాటతో కాస్త ఊరట చెందాడు నాయుడు.ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరో ఏడాది గడిచింది. రోజు పొద్దుటి పూట. కోటీశ్వరుని కుక్కలకు ఫుడ్ పెడుతుండగా సూరపు నాయుడికి ఫోన్ వచ్చింది.
జేబులో ఫోన్ తీసి – అలో అన్నాడు ‘..నీను మామా...’ అన్నాడు అల్లుడు అవతల నుంచి ‘... నువ్వా? బాగున్నావా నాయినా? మాయమ్మీ,పిల్లలూ బాగున్నారా? ‘...ఆ, ఆ, అంతా బాగున్నాం, గానీ...’‘...ఆ..కానీ..?’ఆందోళనగా అడిగాడు సూరపునాయుడు. ‘మేమూ అక్కడకి వలస వొచ్చేస్తాము. మీకు తెలిసిన వోరి దగ్గిర ఏదేనా పని చూడు మామా, వొచ్చేస్తాము...’ ‘...వొచ్చెత్తారా? ఏమీ? మీ తోటలూ, దొడ్లూ ఏటి చేస్తారు?’ ‘...ఏదో పెద్ద కంపెనీ వొస్తందట, ఇంకోపక్క విమానాశ్రయం కడతారట... ఆటికి భూమి కావాలగదా? దగ్గిర, దగ్గిర మా మడకల నాలుగైదు ఊళ్లు ఖాళీ అయిపోతాయి... తొందరగా ఏదేనా పని చూడు మామా...’
ఎలుగుగొడ్డు ఏదో గోళ్ళతో తన గుండెను రక్కినట్టన్పించింది సూరపునాయుడికి. అల్లుడికి ఏమి చెప్పాలో తెలీక, మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే యజమాని వచ్చి, ఏదో పేకెట్ చేత్తో పరిశీలిస్తూ – ‘‘ఓయ్, నాయుడూ, ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పేకెట్ తెచ్చీసావోయ్. ఇది డాగ్స్‌కి పెట్టకు సుమీ. షాప్ వాడికి రిటనిచ్చేయి’’ అనన్నాడు. నాయుడికి అర్థం కాలేదు. అవతల ఫోన్లో అల్లుడు ఏదో చెప్తున్నాడు, అయోమయంగా చూశాడు యజమాని వేపు. ‘‘...ప్రతీ దానికీ కొన్నాళ్లే గడువు వుంటుంది..’’ అని యజమాని పేకెట్లో తేదీని చూపి – ‘‘ఈ తేదీ దాటినాక ఇది వాడకూడదు...
వాడితే డేంజర్’’ అని విడమరిచాడు.యజమాని వివరణ, అల్లుడి సంభాషణ, నాయుడి మనసులో ప్రశ్నలు రేపాయి. –‘ఈ ఎక్స్‌పైరీ డేట్ అనేది మాకూ, మా వలస బతుకులకీ ఉండదా?’ నిజానికి సూరపు నాయుడు మనసులో ఆ ప్రశ్న అనుకున్నాడు కాని, అసంకల్పితంగా నోటి నుండి బయటకి వచ్చేసింది. ఆ యజమానికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఏమిటోయ్ నాయుడూ? ఏమంటున్నావ్?’’ అని ప్రశ్నించాడు.శోకంతో పూడుకు పోయిన సూరపు నాయుడి గొంతు పెగలలేదు, మౌనంగా ఉండిపోయాడు. కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది.


