
సాధారణంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, కంప్యూటర్స్ లేదా ఫోన్స్ ఎక్కువగా చూడటంతో కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్), వాపు, ముడతలు ఏర్పడుతుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పవు. ఇందుకోసం ఈ మెటల్ టూల్ అయిన కళ్ళ మసాజర్ లేదా క్రీమ్ స్పూన్ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ టూల్‌కి ఒకవైపు బాల్ లాంటి భాగం మరోవైపు స్పూన్ లాంటి ఆకారం ఉంటాయి.
క్రీమ్స్, సీరమ్స్ వంటివి వేళ్లతో కాకుండా ఈ టూల్‌తో అప్లై చేసుకుంటే చర్మంపై బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది. ఈ స్పూన్.. జింక్ అలాయ్‌తో తయారైంది. ఇది చాలాకాలం మన్నుతుంది. కళ్ళకు వాడే క్రీములు, ఫేస్‌కి వాడే క్రీమ్స్, డ్రై మాస్క్‌లు, లోషన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు అప్లై చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ మసాజర్‌తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది,
డబుల్ చిన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు, బ్యాగ్స్ కూడా తగ్గుతాయి. ముఖ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ టూల్ చాలా తేలికైనది, చిన్నది కాబట్టి హ్యాండ్‌బ్యాగ్‌లో లేదా జేబులో సులభంగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా దీనితో మసాజ్ చేయడంతో, ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
బెస్ట్ బ్యూటీ ట్రీట్‌మెంట్!
కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని పుట్టుమచ్చలు గడ్డల్లా కనిపిస్తూ, ఉన్న అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేవ్ ఎక్సిషన్ ట్రీట్‌మెంట్ ఒక సాధారణ వైద్య పద్ధతి. చర్మంపై ఉన్న పులిపిర్లు, పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న గడ్డలు తొలగించడానికి ఈ చికిత్స సహకరిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక పదునైన బ్లేడుతో చర్మం పైపొరలో ఉన్న పెరుగుదల భాగాన్ని జాగ్రత్తగా ‘షేవ్’ చేస్తారు.
ఇది లోతైన కోత కాదు, కాబట్టి సాధారణంగా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. ముందుగా, ఆ ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, కాబట్టి నొప్పి తెలియదు. అనంతరం ఒక ప్రత్యేకమైన బ్లేడుతో చర్మంపై ఉన్న గడ్డను జాగ్రత్తగా షేవ్ చేస్తారు. కొద్దిగా రక్తం కనిపించే అవకాశం ఉంటుంది, దాన్ని ఆపడానికి విద్యుత్తు లేదా రసాయనాలను ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ వైద్య నిపుణుడి సమక్షంలోనే ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఉత్తమం.
(చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..)