
అయినా ఆ పురస్కారం నాకు ఇవ్వరు
ఏ పుస్తక రచయితకో ఇస్తారు: ట్రంప్
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏకంగా బెదిరింపులకే దిగారు. తనకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను తీవ్రంగా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు సాయుధ ఘర్షణలను ఆపిన తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.
గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సోమవారం ప్రతిపాదించిన ప్రణాళికపై మంగళవారం క్వాంటికోలో మిలిటరీ అధికారులతో ట్రంప్ మాట్లాడారు. ‘మనం సాధించాం. సమస్య పరిష్కారమైనట్టే అని భావిస్తున్నాను.. చూడాలి మరి. దీనిని హమాస్ అంగీకరించాల్సిందే (శాంతి ప్రణాళికను). లేదంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అరబ్‌దేశాలు, ముస్లిం దేశాలు ప్రణాళికను అంగీకరించాయి. ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది.
ఇది అద్భుతమైన విషయం. పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి పని ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయినా, నోబెల్ బహుమతి ఇస్తారా?.. ఇవ్వనే ఇవ్వరు. ఇలాంటి పని ఏదీ చేయని ఎవరో ఒకరికి ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలపై పుస్తకం రాసి, యుద్ధాన్ని ఎలా ఆపాలి అని అందులో వివరించే ఎవరో ఒకరికి నోబెల్ ఇస్తారు. ఏం జరుగుతుందో చూడాలి.
ఎవరో ఒక పుస్తక రచయితకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మాత్రం అది అమెరికాకు తీవ్రమైన అవమానమే. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. నాకు అది (నోబెల్) అవసరం లేదు. మన దేశం దానిని (నోబెల్) సాధించాలని కోరుకుంటున్నా. గాజా ఘర్షణకు ముగింపు పలికే ప్రణాళిక అమలవుతుందనే భావిస్తున్నా. ఇది నేను ఆశామాషీగా చెప్పటం లేదు. నాకు అన్నింటికంటే ఇలాంటి డీల్స్ గురించి బాగా తెలుసు. నా జీవితం మొత్తం ఇలాంటివాటితోనే గడిచింది. అందులో ఈ 8 (గాజా ఘర్షణతో కలిసి ట్రంప్ ఆపానని చెబుతున్న యుద్ధాలు) గొప్ప విషయాలు’అని ట్రంప్ పేర్కొన్నారు.