
అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
రోజుకు 35 మంది విద్యార్థుల ఆత్మహత్య
ప్రతి ఐదుగురు కాలేజీ విద్యార్థుల్లో ఒకరికి డిప్రెషన్, నలుగురులో ఒకరికి ఆందోళనావ్యాధి
ప్రతి పదిమంది స్కూల్ విద్యార్థుల్లో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్య
ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి?. యువత, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రజా సమస్యగా మారుతోందని. ఇవి ఏవో కాకి లెక్కలు కాదు, ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన విస్తుగొల్పే వాస్తవాలు. విద్యాపరమైన ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, అధిక పోటీతో కూడిన విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆందోళన, నిస్ప ృహ, ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది, ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యార్థుల మానసిక ఆరోగ్య సంక్షోభంపై గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యల రేటు విద్యార్థుల్లో స్థిరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అంటే ప్రతిరోజూ సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలను తీసుకున్నారు. 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6%. గత పదేళ్లలో (2013–2022) విద్యార్థుల ఆత్మహత్యలు 64% పెరిగాయి. ఈ సంఖ్య 6,654 నుండి 13,044కు చేరింది. భారతదేశంలోని 30 విశ్వవిద్యాలయాలలో 2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి పదిమంది విద్యార్థులలో ఒకరికి గత సంవత్సరంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. వీరిలో మూడింట ఒక వంతు మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పరీక్షల్లో వైఫల్యం ఆత్మహత్యలకు ఒక కారణం. రాజస్థాన్‌లోని కోటా సహా కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి పొందిన నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.
పాఠశాల పిల్లల్లో కూడా..
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’, సీబీఎస్‌ఈ సంస్థలు పాఠశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో 13–17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 81% మందికి పరీక్షల ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉందని వెల్లడైంది. యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలో 15–24 సంవత్సరాల వయస్సు గల యువతలో 14% మంది తరచుగా ఆందోళన లేదా డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్నారు.
విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు ఇలా ఉంటాయి. వీటిలో కొన్ని దీర్ఘ కాలం కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉందని అంచనా వేయవచ్చు. నిపుణుల సాయం తీసుకునేలా ప్రోత్సహించవచ్చు.
భావోద్వేగ ప్రవర్తన మార్పులు
నిరంతర విచారం, నిస్సహాయత భావన. ఎక్కువగా చిరాకు పడడం, కోపం లేదా మూడ్ స్వింగ్స్. · ఒకప్పుడు ఆనందించిన కార్యకలాపాల పట్ల ఆసక్తి కోల్పోవడం. · స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం. ·సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం. · విపరీతమైన భయం, ఆందోళన లేదా ఆందోళనతో కూడిన దాడులు.
మానసిక, శారీరక లక్షణాలు
నిద్ర, ఆకలిలో మార్పులు (ఎక్కువ నిద్ర పోవడం లేదా నిద్రలేమి, తక్కువ లేదా ఎక్కువ తినడం). ·ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు.
గతంలో సులభంగా చేసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది.·తీవ్రమైన తలనొప్పి లేదా కడుపు నొప్పులు వంటి వివరించలేని శారీరక నొప్పులు.
ఆత్మ గౌరవం కోల్పోవడం లేదా నిస్సహాయత భావన. ·ఆత్మహత్య ఆలోచనలు లేదా మరణం గురించి ఆలోచించడం.
అకడమిక్, ప్రొఫెషనల్ లక్షణాలు
చదువులో గణనీయమైన క్షీణత.
పాఠశాల పని పట్ల ఆసక్తి తగ్గడం.
తరగతులకు హాజరు కాకపోవడం.
పాఠశాల పనితీరులో ఆకస్మిక మార్పులు.
అవగాహన అంతంత మాత్రమే!
ఓ పక్కన మానసిక ఆరోగ్య సమస్యలు యువతను కారుమబ్బుల్లా కమ్మి వేస్తుంటే, మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన రాహిత్యం కనిపిస్తోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన 2023 సర్వే ప్రకారం, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మానసిక ఆరోగ్య సహాయం కోరితే తోటివారి నుండి ప్రతికూలతను ఎదుర్కొంటారని భయపడుతున్నారు.
‘ది జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ హెల్త్’ నివేదిక ప్రకారం, కేవలం 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ సేవలు ఉన్నట్లు తెలుసు. ఇది కౌన్సెలింగ్ సేవల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అసలు శత్రువు అదే!
యువత, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెచ్చరిల్లడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా వ్యసనం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ నిర్వహించిన సర్వే ప్రకారం యువతలో 70 శాతం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలకు మించి ఫోన్ వాడుతున్నారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తున్నారు. దీనితో ప్రతి ఐదుగురులో ఒకరు డిప్రెషన్ లేదా ఆందోళన బారిన పడుతున్నారు.
వ్యసనంగా ఇలా..
మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో సోషల్ మీడియా వ్యసనం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ వ్యసనం కేవలం ఒక అలవాటు కాదు, ఇది మెదడు పనితీరును మార్చే ఒక న్యూరోసై¯Œ ్స ప్రక్రియ. సోషల్ మీడియా వ్యసనానికి ప్రధాన కారణం మన మెదడులోని డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్. డోపమైన్ ఆనందం, సంతృప్తి, ప్రోత్సాహంతో ముడిపడి ఉన్న ఒక రసాయనం. మనం ఏదైనా సంతోషకరమైన పని చేసినప్పుడు, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు, మెదడులోని రివార్డ్ సిస్టమ్ డోపమై¯Œ ను విడుదల చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి లైక్, కామెంట్, షేర్, కొత్త నోటిఫికేషన్ చిన్నపాటి రివార్డ్‌గా పనిచేస్తుంది. ఈ రివార్డ్‌లు డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయి. యువత మెదడు ఎక్కువ డోపమైన్ పొందడం కోసం నిరంతరం సోషల్ మీడియాను చెక్ చేసుకునేలా అలవాటు పడుతుంది. ఈ నిరంతర ప్రేరణతో మెదడులో డోపమైన్ రిసెప్టర్లు సున్నితత్వాన్ని కోల్పోతాయి, దాంతో మరింత ఎక్కువ డోపమైన్ కోసం మెదడు ఆరాటపడుతుంది. ఇదే వ్యసనానికి దారి తీస్తుంది.
మానసిక ఆరోగ్యం మటాష్!
సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగంగా మారింది. యువతపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇది సమాచారాన్ని పంచుకోవడానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఒక వేదికగా ఉన్నప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. వివిధ సర్వేలు, అధ్యయనాలు యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తున్నాయి.
ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. దాదాపు 46 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారతదేశంలో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది.
యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన‘ జీవితాలను చూసి తమను తాము పోల్చుకోవడంతో యువతలో ఆత్మన్యూనత భావన పెరుగుతోంది. ఇది అసూయ, అసంతృప్తి, ఒత్తిడికి కారణమవుతోంది. ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు యువతలో తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తున్నాయి. వీటి వల్ల వారు నిస్పృహకు, ఆందోళనకు గురవుతున్నారు.
ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూసే అందమైన ఫోటోలు, వీడియోల వల్ల యువత ముఖ్యంగా మహిళలు, తమ శరీర రూపాన్ని గురించి ఆందోళన చెందుతున్నారు. భారత యువతుల్లో 36 శాతం మంది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఇది బులీమియా, అనోరెక్సియా నెర్వోసా లాంటి ఈటింగ్ డిజార్డర్స్‌కు దారి తీస్తోంది.
యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడులో మార్పులు
సోషల్ మీడియా వ్యసనం మెదడులోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది.
ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనా శక్తి, ప్రేరణ నియంత్రణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటుపడిన వారిలో ఈ భాగం బలహీనపడుతుంది. దీనివల్ల వారు తమ ఫో¯Œ ను వాడటాన్ని నియంత్రించుకోలేరు, త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు, ఏకాగ్రతను కోల్పోతారు.
అమిగ్డాలా భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. సోషల్ మీడియాలో చూసే ప్రతికూల విషయాలు అమిగ్డాలాను నిరంతరం ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళనకు, డిప్రెష¯Œ కు దారితీస్తుంది.
హిప్పోకాంపస్ భాగం జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల హిప్పోకాంపస్ పనితీరు తగ్గుతుంది, ఇది చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
సుప్రీం కోర్టు దిశానిర్దేశం
యువత మానసిక ఆరోగ్య సమస్యలకు సోషల్ మీడియాతో పాటు మారిన జీవనశైలి, సామాజిక పరిస్థితులు కూడా కారణం. దీనికి తోడు నిపుణుల కొరత, నిధుల కొరత కూడా వారికి సరైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నాయి. దేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’ ప్రకారం ప్రతి లక్ష జనాభాకు కేవలం సరాసరిన 0.7 శాతం మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. సైక్రియాట్రిస్ట్‌లు 0.75 శాతం, క్లినికల్ సైకాలజిస్టులు 0.07 శాతం వరకు అందుబాటులో ఉన్నారు. మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు ఉండాలి. ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైకియాట్రీ, సైకాలజీ కోర్సులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్‌లో మానసిక ఆరోగ్య సేవలకు కేవలం 1,004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో ఒక శాతం. ఇందులో కూడా 860 కోట్లు బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్)కు, రూ. 80 కోట్లు ‘టెలిమానస్’కు కేటాయించడంతో మానసిక ఆరోగ్య సేవలు యువతకు చేరడం సాధ్యపడటం లేదు.
నానాటికీ పెరిగిపోతున్న యువత, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి మానసిక క్షేమంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించింది.
ప్రతి వందమంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్‌ను నియమించాలి. ఏడాదిలో రెండుసార్లు టీచర్స్‌కు, ఇతర సిబ్బందికి విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి.
విద్యా సంస్థల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను అందుబాటు ఉంచాలి, ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులపై అకడమిక్ విషయంలో ఎలాంటి లేబుల్స్ వేయకూడదు. విద్యేతర విషయాల్లో ప్రోత్సహించాలి.
ర్యాగింగ్, లైంగిక వేధింపులు వంటి వాటిపై సత్వరమే స్పందించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్ నంబర్స్ అందరికీ కనిపించేటట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి.
పేరెంట్స్‌తో తరచుగా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి.
సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు విద్యార్థుల్లో, టీచర్స్‌లో మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలను పోగొట్టగలిగితే స్వామి వివేకానంద చెప్పినట్లుగా వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు ఉన్న యువ భారతాన్ని చూడొచ్చు.
రచయిత: జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు,
అడ్వాన్స్‌డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఏ ఇండియా)