
మిరియాల పులిహోర
కావలసినవి: బియ్యం– ఒక కప్పు, నీళ్లు– 2 కప్పులు
చింతపండు– పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకోవచ్చు
పచ్చిమిర్చి– 3 (సన్నగా తరగాలి), ఎండుమిర్చి– 4 (ముక్కలు చేసుకోవాలి), మిరియాలు– ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ (పొడి చేసుకోవాలి), ఆవాలు– ఒక టీ స్పూన్, మినపపప్పు, శనగపప్పు– ఒక టేబుల్ స్పూన్ చొప్పున, నూనె, పల్లీలు– 3 టేబుల్ స్పూన్లు చొప్పున, బెల్లం కోరు– ఒక టీ స్పూన్, పసుపు– అర టీ స్పూన్, ఇంగువ– చిటికెడు, కరివేపాకు– 2 రెమ్మలు, ఉప్పు– తగినంత
తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉడికించుకోవాలి. అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు. ఈలోపు చింతపండును నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిరియాలను నూనె లేకుండా వేయించి చల్లార్చి, మెత్తని పొడిలా చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇంతలో ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, పల్లీలు వేసి వేగించాలి. అనంతరం అందులో తరిగిన పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లం తురుము, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పుతో పాటు ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే సరిపోతుంది.
పనీర్ జిలేబీ
కావలసినవి: పనీర్ తురుము– 250 గ్రాములు, మైదా పిండి– ఒక కప్పు
ఏలకుల పొడి– అర టీస్పూన్, బేకింగ్ పౌడర్– పావు టీస్పూన్
పంచదార– 2 కప్పులు, నీళ్లు– ఒక కప్పు (పాకం కోసం), నెయ్యి– సరిపడా
పిస్తా, జీడిపప్పు ముక్కలు– గార్నిష్‌కి
తయారీ: ముందుగా పనీర్ తురుమును బాగా మెత్తగా చేతితో నలుపుకోవాలి. ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో ఈ మెత్తని పనీర్, మైదా పిండి, ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, జిలేబీ పిండి మాదిరిగా గట్టిగా, మందంగా ఉండేలా కలుపుకోవాలి. పిండి చాలా పల్చగా ఉండకూడదు. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగి పాకం కొంచెం చిక్కబడిన తర్వాత, దానిని స్టవ్ నుంచి దింపెయ్యాలి. ఈలోపు ఒక వెడల్పాటి పా¯Œ లో నెయ్యి వేడి చేసుకోవాలి. జిలేబీ మేకర్‌లో మైదా మిశ్రమాన్ని నింపుకుని, నచ్చిన విధంగా నేతిలో జిలేబీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేడిగా ఉన్నçప్పుడే గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో ముంచాలి. ఐదు లేదా పది నిమిషాలు పాకంలో జిలేబీలు మునిగేలా ఉంచి ఆ తర్వాత వాటిపైన జీడిపప్పు, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
కేసర్ పెడా
కావలసినవి: పాల పొడి– 2 కప్పులు, నెయ్యి– 4 చెంచాలు, కండెన్స్‌డ్ మిల్క్– ఒక కప్పు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్– కొద్దిగా, కొన్ని పిస్తా పప్పులు– గార్నిష్ కోసం, కుంకుమ పువ్వు– కొద్దిగా, (వెచ్చని పాలలో నానబెట్టుకోవాలి)
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద, ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, గరిటెతో కలుపుతూనే పాల పొడి, కండెన్స్‌డ్ మిల్క్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వడకట్టి, వాటిని వేసి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు స్టవ్ మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.
కాసేపు స్టవ్ మీద నుంచి గిన్నె పక్కకు దించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా స్టవ్ మీద కాసేపు మామూలుగా కాసేపు గరిటెతో కలిపితే ఆ మిశ్రమం పాత్రకు అంటకుండా ముద్దలా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 15 నుంచి 20 నిమిషాలు చల్లారనివ్వాలి. అనంతరం 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, దాన్ని మృదువుగా చేసుకోవాలి. అనంతరం పిస్తా పప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
(చదవండి: రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం)