
ఆ చీకటి కేబిన్ లోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. దైవజ్ఞ తన చేతి గడియారాన్ని చూసుకుని లేచాడు. రో 23జి సీట్‌కి చేరుకుని, అందులో కూర్చుని గాఢనిద్రలో ఉన్న ఏభైపైబడ్డ ఆవిడ మెడ కింద, డిన్నర్‌తో ఇచ్చిన స్టీల్ కత్తితో కసుక్కున అడ్డంగా కోశాడు. ఆవిడ మెలకువ వచ్చి చిన్నగా కేకపెట్టింది. రక్తం చిందింది. కాని పూర్తిగా తెగలేదు. మరోసారి, ఇంకోసారి. గరగర శబ్దంతో పాటు ఆ మెడలోంచి ఎర్రటి గాలి బుడగలు బయటికి వచ్చాయి.
దైవజ్ఞ ఆవిడ సీట్ మీది రీడింగ్ లైట్‌ని వెలిగించి, కాల్ బటన్ ని నొక్కాడు. నిమిషంలో ఏర్‌హోస్టెస్ అక్కడికి వచ్చింది. రీడింగ్ లైట్‌లో ఆవిడ మెడ నించి తల అతి అసహజ రీతిలో పక్కకి వేలాడటం, ఆవిడ ఛాతీ రక్తంతో తడిసి ఉండటం చూసి ఆమె భయంగా రెండు అడుగులు వెనక్కి వేసింది. దైవజ్ఞ ఆమెకి మడిచిన కాటన్ నేప్‌కిన్ ని ఇచ్చి చెప్పాడు.‘‘నేనే చంపాను. ఇది హత్యాయుధం.’’
అయోమయంగా చూసే ఆమె తన చెవులని తనే నమ్మలేకపోయింది.‘‘మీ పైలెట్‌కి ఈ విషయం చెప్పండి. లాగ్ బుక్‌లో రాస్తారు.’’ అతను శాంతంగా చెప్పాడు.ట్రాన్ ్సలో ఉన్నట్లుగా ఆమె కాక్‌పిట్‌లోకి వెళ్ళింది. గజ గజ వణుకుతూ వగరుస్తూ మధ్య మధ్యలో ఆపి చెప్పింది.‘‘సీట్ 23జిలోని లేడీ మెడ తెగింది. ఒకతను తనే చంపానని, ఇందులో కత్తి ఉందని చెప్పి ఇచ్చాడు.’’‘‘నువ్వు చూస్తూండు.’’ తక్షణం కెప్టెన్ లేస్తూ ఫస్ట్ ఆఫీసర్‌తో చెప్పాడు.ఇద్దరూ 23 జి దగ్గరకి వచ్చారు. దైవజ్ఞని ఇద్దరు ప్రయాణికులు కదలకుండా చేతులు బిగించి పట్టుకున్నారు.‘‘కెప్టెన్ . నా పేరు దైవజ్ఞ. నన్ను వదలమని చెప్పండి. తలుపు తెరుచుకుని పారిపోతానా?’’ దైవజ్ఞ నవ్వుతూ సూచించాడు.
‘‘ఇతను ఈవిడని పొడవడం నేను చూశాను. ఇదే వరుసలో లేప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాను.’’ ఒకడు చెప్పాడు.‘‘ఎందుకు చంపావు?’’ హతురాలి మీద దుప్పటిని కప్పుతూ కెప్టెన్ అడిగాడు.‘‘ఇక్కడ చంపితే నాకు శిక్ష పడదని.’’‘‘నువ్వు నేరాన్ని ఒప్పుకున్నావు. సాక్షులు కూడా ఉన్నారు. ఎందుకు శిక్ష పడదు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘నా నేరానికి నన్ను ఎవరు శిక్షిస్తారు?’’ దైవజ్ఞ ప్రశ్నించాడు.‘‘మన విమానం షికాగోలో దిగగానే అక్కడి పోలీసులు.’’‘‘వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే ఫాల్స్ అరెస్ట్‌కి వాళ్ళ మీద నష్టపరిహార దావా వేస్తానని కూడా చెప్పండి. చూస్తూండండి. నేను స్వేచ్ఛగా తిరుగు విమానంలో వెళ్ళిపోతాను.’’అతను పిచ్చివాడని అనుమానించిన కెప్టెన్‌కి కాదని, మేధావి అయుండొచ్చని అనిపించింది. చాలామంది ప్రయాణికులు లేచారు.
‘‘ఈ లేడీ విలన్ ని చంపటానికి నేను ఈ ప్రదేశాన్ని, ఈ సమయాన్ని ఎన్నుకున్నాను కెప్టెన్. ప్రపంచంలో ఎవరూ నా నేరానికి శిక్షించలేరు. అందుకు సాంకేతికతలు అడ్డు వస్తాయి.’’ దైవజ్ఞ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.‘‘సాంకేతికతలా? ఏమిటవి?’’ ప్రయాణికుల్లోని ఒకరు ప్రశ్నించారు.‘‘నన్ను ఈ నేరానికి అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. చేస్తే నన్ను ఎక్కడ విచారిస్తారు?’’‘‘ఇండియాలో. నేను లాయర్‌ని.’’ ఒకరు చెప్పారు.‘‘మీరు మళ్ళీ లా క్లాస్‌లో చేరండి లాయర్‌గారు. నేరం ఇండియా భూభాగం మీద జరగలేదు. ఇది ఇండియా విమానం తప్ప ఇండియన్ కన్సులేటో లేదా ఎంబసీనో కాదు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో, ఆకాశంలో ఈ నేరం జరిగింది. నేరం జరిగిన స్థలం నుంచి రెండు వందల నాటికల్ మైల్స్‌లో ఏ దేశం లేదు. ప్రపంచంలోని ఏ దేశానికి జ్యూరిస్‌డిక్షన్ లేని చోటుని ఎంచుకుని మరీ ఈవిడని చంపాను.’’ దైవజ్ఞ చిరునవ్వుతో చెప్పాడు.
‘‘ఎందుకు చంపారు?’’ ఏర్‌హోస్టెస్ ప్రశ్నించింది.‘‘ఈవిడ న్యూరాలజిస్ట్. హైద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సంవత్సరానికి కోటి రూపాయల పేకేజ్‌తో పని చేస్తోంది. అంత జీతం పొందటానికి ఆవిడకి నెలకి హాస్పిటల్‌కి ఎంత సంపాదించి పెట్టాలో టార్గెట్స్ ఉంటాయి. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్. మరణం తథ్యమని తెలిసీ హాస్పిటల్లో చేర్పించమంది. ఎన్ని టెస్టులు రాసిందో! పన్నెండు రోజులకి ముప్ఫైరెండు లక్షల బిల్‌ని సొంత ఇంటిని అమ్మి కట్టాను. నేను ఓ ఫేక్టరీలో టర్నర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈవిడ వల్ల మా ఆవిడతో పాటు నాకు నిలువ నీడ కూడా పోయింది.
నా భార్యకి ఇచ్చిన మందుల సైడ్ ఎఫెక్ట్‌ల వల్ల తిన్నది తిన్నట్లుగా వాంతైపోయి, ఎప్పుడూ మైకంలో ఉండేది. మా ఆవిడ బతకదని తెలిసీ మభ్యపెట్టి నన్ను దోపిడీ చేసింది. ఆ శిక్ష పడని నేరానికి, నేనూ శిక్ష పడకుండా ఈవిడని ఎలా చంపాలా అని చాలా రీసెర్చ్ చేసి, ఆవిడ విమాన ప్రయాణం కోసం ఏడు నెలలుగా వేచి చూస్తున్నాను. ఇక్కడ నా పగ తీర్చుకున్నాను. షికాగోలో దిగాక తిరిగి విమానంలో మళ్ళీ హైద్రాబాద్ వెళ్ళిపోతాను. ప్రపంచంలోని అన్ని దినపత్రికలు నా గురించి రేపు రాస్తాయని పందెం.’’
‘‘నీ పథకంలో ఓ ఎదురుచూడని భాగం కూడా ఉంది.’’ అతన్ని పట్టుకున్న వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు.‘‘ఏమిటది?’’‘‘ఇది. నీకెంత పగ ఉందో నాకు అంతే పగ ఉంది. ఇక్కడ జరిగిన నేరానికి నీకులా నాకూ శిక్ష పడదు.’’ చెప్పి అతను ఓ సిరంజిలోని నీడిల్‌ని చటుక్కున దైవజ్ఞ భుజంలో గుచ్చి ఇంజెక్ట్ చేశాడు.దైవజ్ఞ తల పక్కకి వాల్చగానే ప్రయాణికులు మరోసారి దిగ్భ్రాంతి చెందారు.‘‘మీరెవరు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘ఆవిడ మా అమ్మ.’’ అతను కూడా దైవజ్ఞ అంత శాంతంగా జవాబు చెప్పాడు.
‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే
ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
భాగస్వాములను చేయనున్నారు.
మీరైతే ఈ కథకు ఏ శీర్షిక పెడతారో
ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com